Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..

  • ఇండియా కూటమికి శరద్ పవార్ షాక్..
  • డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం.?
  • అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు ఉంటే మద్దతిస్తామన్న సుప్రియా సూలే..
Sharad Pawar

Sharad Pawar

Delimitation bill: ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్డీయే సర్కార్ మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్ బిల్లు)ను తీసుకురావాలని చూస్తోంది. అయితే, ఈ నేపథ్యంలో బీజేపీకి అనూహ్య మద్దతు లభించినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయితే, దేశంలో జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు హామీ బిల్లులో స్పష్టంగా ఉంటేనే బిల్లుకు మద్దతు ఇస్తామని ఆ పార్టీ సంకేతాలు ఇచ్చింది. ఇదే నిజమైతే ఇప్పటి వరకు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న ఇండియా కూటమికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు శరద్ పవార్ పార్టీ కూడా ఎన్డీయేకు మద్దతు తెలిపేందుకు సిద్ధమైంది.

ఈ పరిణామాలకు ముందు ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో రహస్యంగా భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియాసూలే మాట్లాడుతూ.. ఈ ఊహాగానాలను ధ్రువీకరించడానికి నిరాకరించారు. ‘‘ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య 50 శాతం పెంచి, దానిని అమలును స్పష్టం చేస్తే మేము మద్దతు ఇస్తాము’’ అని అన్నారు. ఏప్రిల్‌లో లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాలు పెంచేలా బిల్లును సవరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని చెప్పారు.

లోక్‌సభలో సభ్యుల సంఖ్య 850కి పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఏప్రిల్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026ను కేంద్రం తీసుకువచ్చింది. అయితే మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోవడంతో బిల్లు వీగిపోయింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాట్లాడుతూ.. బీజేపీ శరద్ పవార్, డీఎంకే మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం అమలైతే జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో మరోసారి డీలిమిటేషన్ బిల్లు చర్చనీయాంశంగా మారింది.