శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి షిండే ఉపముఖ్యమంత్రి అవుతారని అనుకున్నట్లు ఆయన వెల్లడించారు. కానీ ఈ పరిణామాన్ని తాను ఊపించలేదన్నారు. బహుశా ఇంతపెద్ద పదవి వస్తుందని షిండేకు కూడా తెలిసి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన కూడా తనలాగే షాకయ్యి ఉండవచ్చని అన్నారు. నూతన సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూడీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లకు పవార్ శుభాకాంక్షలు తెలిపారు. ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అయితే ఉప ముఖ్యమంత్రి పదవితో దేవేంద్ర ఫడ్నవీస్ సముఖంగా లేరని, ఫడ్నవీస్ ముఖంలో ఆ చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. కేవలం అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఫడ్నవీస్ అలా నడుచుకున్నారని పవార్ అన్నారు. మరోవైపు మహారాష్ట్రలో శివసేన పని అయిపోయిందంటూ వినిపిస్తున్న వాదనలను శరద్ పవార్ కొట్టి పారేశారు. ఇలాంటి ఒడిదుడుకులను శివసేన ఎన్నో ఎదుర్కొందని, ఇప్పటి పరిస్థితి ఆ పార్టీకి కొత్తేం కాదని అన్నారు.