Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన అధినేత, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ భేటీ సంచలనంగా మారింది. ఈ భేటీపై ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే స్పందించారు. ఈ భేటీపై జరుగుతున్న చర్చల్ని ‘‘టీకప్పులో తుఫాను’’గా అభివర్ణించారు. ఈ భేటీకి ఇంత ప్రచారం అవసరం లేదని చెప్పారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన చిన్న సమావేశమని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కొందరు శరద్ పవార్ వర్గం ఎంపీలు ఎన్డీయేలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు. తమ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నామని, అంతా ఐక్యంగా ఉన్నామని చెప్పారు. ఈ భేటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం అపార్థం వల్లే జరిగిందని ఆమె క్లారిటీ ఇచ్చారు. సంజయ్ రౌత్‌తో మాట్లాడానని, ఎలాంటి సమస్య లేదని చెప్పారు.
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి శరద్ పవార్ హాజరయ్యారు. దీని తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోని షిండే కార్యకలాపానికి వెళ్లారు. దీంతో శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ కూడా ఇలాంటా వ్యాఖ్యలే చేశారు. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే జయంత్ పాటిల్ ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఐక్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.

