NTV Telugu Site icon

PM Modi: “సందేశ్‌ఖాలీ” బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రకి ప్రధాని మోడీ ఫోన్.. “శక్తి స్వరూపిణి” అంటూ..

Rekha Patra

Rekha Patra

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు సందేశ్‌ఖాలీ బాధితురాలు, బీజేపీ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖా పాత్రకి ఫోన్ చేసి మాట్లాడారు. బసిర్‌హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమెను బీజేపీ తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది. సందేశ్‌ఖాలీలో ప్రజల మానసిక పరిస్థితి గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. రేఖా పాత్రను ‘శక్తి స్వరూపిణి‌’గా ప్రధాని మోడీ అభివర్ణించారు. సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళల బాధల్ని, తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకులు వేధింపుల గురించి రేఖ ప్రధానికి తెలిపారు.

‘‘ మీరు సందేశ్‌ఖాలీలో పెద్ద యుద్ధం చేశారు. నువ్వు శక్తి స్వరూపానివి. శక్తివంతమైన నేతను జైలుకు పంపారు. సందేశ్‌ఖాలీలోని మహిళల గొంతు ఎత్తడం సాధారణ విషయం కాదు. బెంగాల్‌లోని నారీ శక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని మీ ధైర్యం తెలియజేస్తుంది. కేంద్రం చేసిన పనుల గురించి ప్రజలకు తెలియజేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వం వల్ల ప్రజలు విసిగిపోయారు, ఇది రాష్ట్రంలో కేంద్ర పథకాలను అమలు చేయనివ్వదు,’’ అని ప్రధాని మోడీ రేఖ పాత్రను ప్రశంసించారు. దీనికి రేఖ బదులిస్తూ..‘‘ మహిళల మద్దతుతో దీనిని నేను చేయగలిగాను, నేను వారు చూపిన మార్గంలో నడుస్తాను, అందర్ని వెంట తీసుకెళుతాను’’ అని అన్నారు. శక్తి అనే పదం దుర్గా, కాళీ వంటి దేవతలతో ముడిపడి ఉంది.

Read Also: Kejriwal: అరెస్ట్‌పై కేజ్రీవాల్ పిటిషన్.. విచారణ ఎప్పుడంటే..!

లోక్‌సభ ఎన్నికల ముందు తృణమూల్ నేతలు సందేశ్‌ఖాలీ మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని మహిళలు టీఎంసీ నేతలు, మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఎత్తున నిరసనలు చేయడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత పేరు దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మహిళా ఉద్యమంలో రేఖాపాత్ర కీలకంగా వ్యవహరించారు. సందేశ్ ఖాలీ ప్రాంతం బసిర్‌హాట్ ఎంపీ పరిధి కిందకు వస్తుంది, దీనికి బీజేపీ తన ఎంపీ అభ్యర్థిగా రేఖా పాత్రను ఎంచుకుంది.

తృణమూల్ మాజీ స్ట్రాంగ్ లీడర్ షేక్ షాజహాన్, అతని అనుచరులు సందేశ్‌ఖాలీ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో షాజహాన్ భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. నెల క్రితం రేషన్ కుంభకోణంలో విచారణకు వెళ్లిన ఈడీ అధికారులపై షేక్ షాజహాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి 55 రోజులు పరారీలో ఉన్న అతడిని, కలకత్తా హైకోర్టు అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతనిపై ఉన్న కేసుల్ని సీబీఐ విచారిస్తోంది.