Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రవాదుల కీలక సూత్రధారుల్లో ఒకరైన పాక్-కెనెడియన్ తహవూర్ రాణా విచారణ ప్రారంభమైంది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారిస్తోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి రోజు విచారణకు రాణా పెద్దగా సహకరించలేదని, పరిమిత సమాచారాన్ని అందించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తహవూర్ రాణా ఏం చెప్పాడు..?
ప్రాథమిక సమాచారం ప్రకారం, రానా సొంత ఊరు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని చిచావత్ని అనే గ్రామం. అతడి తండ్రి స్కూల్ ప్రిన్సిపాల్. మొత్తం ముగ్గురు సంతానం. వీరిలో ఒకరు పాక్ సైన్యంలో మానసిక వైద్యుడిగా పనిచేస్తుండగా, మరొకరు జర్నలిస్టుగా ఉన్నారు. రాణా ఉగ్రవాదిగా తయారయ్యాడు. రాణా హసనాబ్దల్ లోని క్యాడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే అతను ముంబై దాడుల్లో కీలక వ్యక్తిగా ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ( ( దావూద్ సయీద్ గిలానీ)తో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం హెడ్లీ యూఎస్ జైలులో ఉన్నాడు.
1997లో రాణా భార్య సమ్రాజ్ రాణా అక్తర్ అనే ప్రాక్టీసింగ్ ఫిజీషియన్‌తో కలిసి కెనడా వలస వెళ్లాడు. అక్కడే ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ప్రారంభించాడు. ఆ తర్వాత హలాల్ మాంసం వ్యాపారాన్ని ప్రారంభించాడు. హెడ్లీ కన్సల్టెంట్‌గా నటిస్తూ ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడ్డాడు. ఈ ఇమ్మిగ్రేషన్ వ్యాపారాన్ని ఒక ముసుగుగా వాడుకున్నాడు.
డాక్టర్ అయిన రాణా పాకిస్తాన్ సైన్యంలో మెడికల్ కార్ప్స్‌లో పనిచేశాడు. ఎన్ఐఏ ప్రకారం, సర్వీసుని విడిచిపెట్టి, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), లష్కరే తోయిబా ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్నాడు. సైనిక దుస్తుల్లోనే అతను ఉగ్రవాద శిబిరాలను సందర్శించే వాడు. రాణా పరిచయాల్లో గ్లోబల్ టెర్రరిస్ట్, భారత మోస్ట్ వాంటెంట్ సాజిత్ మీర్ కూడా ఉన్నాడు. 26/11 దాడుల సమయంలో సాజిద్ మీర్ ప్రధాన హ్యాండ్లర్‌గా వ్యవహరించాడు. ముంబైలోని చాబాద్ హౌజ్‌పై దాడికి ఇతడే కుట్ర పన్నాడు.
రాణాకు లష్కరే తోయిబా కాకుండా,హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామి (హుజీ)తో కూడా సంబంధాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ఇతడు ఐఎస్ఐ, పాక్ ఆర్మీ సిబ్బందితో కలిసి ఉండేవాడు. 2010లో యూఎస్‌లో పనిచేసిన ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ డేవిడ్ హెడ్లీ నిర్వహించిన నిఘా కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసే వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
రాణాను ఎవరు విచారిస్తున్నారు?
ఢిల్లీలోని ఎన్ఐఏ సీజీఓ కాంప్లెక్స్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో సీసీటీవీ అమర్చిన గదిలో రాణాను విచారిస్తున్నారు. రాణాను ఉంచిన సెల్ 24 గంటలు నిఘాలోనే ఉంటుంది. అనుమతి పొందిన 12 మంది అధికారులకు మాత్రమే యాక్సెస్ ఉంది. సెల్ లోపల భోజనం, మందులు, ప్రాథమిక అవసరాలకు సంబంధించినవి ఉన్నాయి. సెల్ లోపల మంచం, టాయిలెట్ ఉంది. విచారణ ప్రక్రియను రికార్డ్ చేసి రోజూవారీ కేస్ డైరీలో నమోదు చేస్తున్నారు.
ఈ 12 మంది అధికారుల్లో ఇద్దరు సీనియర్ ఎన్ఐఏ అధికారులు డీఐజీ జయ రాయ్, ఐజీ ఆశిష్ బాత్రా ఉన్నారు. జార్ఖండ్ కేడర్‌కు చెందిన 2011 బ్యాచ్ IPS అధికారి అయిన DIG రాయ్, సైబర్ నేరాలను దర్యాప్తు చేయడంలో అనుభవం కలిగి ఉన్నారు. ఆమె 2019 నుంచి ఎన్ఐఏలో ఉన్నారు. రాణాను అమెరికా నుంచి రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఆశిష్ బాత్రా 1997 బ్యాచ్ అధికారి. ఎన్ఐఏలో ఐజీగా పనిచేస్తున్నారు.