Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పూంచ్‌లో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడికి తెగబడ్డారు. లోపల ఉన్న సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే సైనికులు కూడా ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. ఇప్పటి వరకు ఈ ఎదురుకాల్పుల్లో గాయాలు, కానీ మరణాలు కానీ నివేదించబడలేదు. సమీపంలోని ఎత్తైన కొండ పై నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్‌లో అనేక వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే పూంచ్ ప్రాంతంలో కొన్ని వారాల క్రితం రెండు సైనిక వాహనాలపై కాల్పులు జరిపి నలుగురు జవాన్ల మరణానికి కారణమయ్యారు. తాజాగా ఇదే విధంగా మరోసారి దాడికి తెగబడ్డారు. డిసెంబరు 21న, పూంచ్ జిల్లాలోని ధాత్యార్ మోర్ సమీపంలో బ్లైండ్ కర్వ్ వద్ద రెండు ఆర్మీ వాహనాలపై భారీ సాయుధ ఉగ్రవాదుల బృందం దాడి చేసింది, ఫలితంగా నలుగురు జవాన్లు మరణించారు, ఇద్దరు గాయపడ్డారు. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) డిసెంబర్‌లో జరిగిన పూంచ్ ఉగ్రదాడికి బాధ్యత వహించింది. ఇది లష్కరేతోయిబాకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది.
Read Also: Covid Sub-Variant JN.1: మాల్దీవుల నుంచి ఇండియాకు వచ్చిన మహిళకి JN.1 వేరియంట్ పాజిటివ్..
తాజా దాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తున్నాయి. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో సహా ఉన్నత స్థాయి అధికారులు పూంచ్‌లో తరచూ తీవ్రవాద దాడులను ఎదుర్కోవడానికి వ్యూహాలను రూపొందిస్తున్న క్రమంలో ఈ రోజు దాడి చోటు చేసుకుంది. ఈ రోజు దాడి జరిగిన ప్రాంతం.. కొన్ని వారాల క్రితం దాడి జరిగిన ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రాజౌరీ, పూంచ్ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. పిర్ పంజాల్ పర్వతాలు కలిగిన ఈ ప్రాంతాలు ఉగ్రవాదులు దాక్కోవడానికి కొండ గుహలు, అడవులు సహకరిస్తున్నాయి. గత ఏడు నెలల్లో ఈ ప్రాంతాల్లో అధికారులు, కమాండోలతో కలిపి 20 మంది సైనికులు మరణించారు. గత రెండేళ్లలో 35 మందికి పైగా సైనికులు మరణించారు.