Site icon NTV Telugu

Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా సర్వే పిటిషన్‌ని కొట్టేసిన సుప్రీంకోర్టు..

Janmabhoomi Shahi Eidgah

Janmabhoomi Shahi Eidgah

Krishna Janmabhoomi: ఉత్తర్ ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని సర్వే చేయాలిన నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సమస్యను అలహాబాద్ హైకోర్టు నిర్ణయానికి వదిలివేసింది. దీనిపై దాఖలైన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు విచారిస్తోంది. ఈ వివాదంపై దాదాపు 10 పిటిషన్లు అలహాబాద్ హైకోర్టు దాఖలైనట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

అలహాబాద్ హైకోర్టులో ఈ సమస్య పెండింగ్ లో ఉన్నందున మేము మా అధికార పరిధిని ఉపయోగించాల్సిన అవసరం లేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని మే 26న హై కోర్టు నిర్ణయించింది. రంజనా అగ్నిహోత్రి అనే న్యాయవాది ఈ సమస్యపై పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి.

Read Also: Uttar Pradesh: ఆన్‌లైన్ లో పరిచయమైన అమ్మాయిని కాల్చిచంపిన వ్యక్తి..

కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా భూవివాదానికి సంబంధించి పలు దావాలు మధురలోని కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయి. మసీదులోని 13.37 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. శ్రీకృష్ణ ఆలయం, షాహీ ఈద్గా పక్కపక్కనే ఉన్నాయి. 1968లో మసీదు కమిటీ, శ్రీకృష్ణజన్మస్థాన్ సేవా సంఘ్ మధ్య జరిగిన రాజీని రద్దు చేయాలని పలు పిటిషన్లు కోరాయి. మసీదు ఉన్న స్థలంలోనే కంటిన్యూ అయ్యేలా ఒప్పందం కుదిరింది. అయితే ఒక్క అయోధ్య రామజన్మభూమి మినహాయించి ఆగస్టు 15, 1947 నాటికి ఉన్న ప్రార్థన స్థలాలను రక్షించేందుకు ఉద్దేశించిన ప్రార్థన స్థలాల చట్టం ప్రకారం అన్ని పిటిషన్లు నిషేధించబడతాయని మసీదు కమిటీ వాదిస్తోంది.

Exit mobile version