Site icon NTV Telugu

SC Categorisation: శెభాష్‌ కాంగ్రెస్‌. బీజేపీ, టీఆర్ఎస్‌లను ఇరుకునపెట్టే ఎత్తుగడ. ఎస్సీల వర్గీకరణ.

Sc Categorisation

Sc Categorisation

SC Categorisation: షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మళ్లీ తెరమీదికి రాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో అమలైన ఏబీసీడీ వర్గీకరణ 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావటంతో నిలిచిపోయింది. సుప్రీంకోర్టు బ్రేక్‌ వేయటమే దీనికి ప్రధాన కారణం. అయితే దీనిపై ఉషామెహ్రా కమిటీ అభిప్రాయ సేకరణ జరిపి 2008లో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, 3వ క్లాజును చేర్చడం ద్వారా అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేస్తే వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిటీ సిఫారసు చేశారు.

అయితే 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ దీన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇప్పటివకి 8 ఏళ్లు దాటింది. అయినా ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ లోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో హస్తం పార్టీ ఉనికి కోసం పోరాడుతుండగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఈ అంశాన్ని పార్లమెంట్‌ వేదికగా చర్చించాలని భావిస్తోంది.

Record Level Car Sales: దూసుకెళ్లిన కార్ల విక్రయాలు.. రెండేళ్ల కిందటి రికార్డు బద్ధలు..

తద్వారా ఇటు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఏక కాలంలో ఇరుకున పెట్టడానికి ఎత్తుగడ వేస్తోంది. ప్రస్తుత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని, ఈ మేరకు కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలోని మాదిగ సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. ఈ మేరకు నిన్న సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ నేతృత్వంలో వహించారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని సంపత్‌ నాయకత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ మంగళవారం ఢిల్లీలో కలవాలని తీర్మానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, సిరిసిల్ల రాజయ్య, జె.గంగారాం, కె.సత్యనారాయణ, పీసీసీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ఎన్‌.ప్రీతంతోపాటు వివిధ జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం కొంత ప్రయత్నం చేశారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా పలుమార్లు మద్దతు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సైతం ఎస్సీ వర్గకరణ అంశాన్ని తానే హ్యాండిల్‌ చేస్తానని గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎస్సీల వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పనైపోయిందంటూ ఎద్దేవా చేసిన ఆయన ఇప్పుడు దీన్ని పట్టించుకోవట్లేదు. దీంతో క్రెడిట్‌ కొట్టేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ తాజాగా ప్రణాళికలు సిద్ధం చేసింది.

Exit mobile version