Bhajan Lal Sharma: రాజకీయ హేమాహేమీలు, దిగ్గజాలు ఉన్నా కూడా వారందరిని పక్కన పెట్టి అనూహ్యమైన వ్యక్తిని రాజస్థాన్ సీఎంగా ప్రకటించింది బీజేపీ. మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్ వంటి వ్యక్తులను పక్కనపెడుతూ.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మకు రాజస్థాన్ అధికార పగ్గాలు అప్పగించింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాగే విష్ణుదేవ్ సాయ్, మోహన్ యాదవ్‌లను సీఎంలుగా ప్రకటించిన సర్‌ప్రైజ్ చేసిన బీజేపీ, రాజస్థాన్ సీఎం అభ్యర్థి విషయంలోనూ ఇదే ఫార్ములాను అనుసరించింది.
అయితే, భజన్‌లాల్ శర్మ తాను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తిని ఏకంగా సీఎం సీటుపై కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆయనతో పాటు జైపూర్ రాజవంశీయురాలు దియా కుమారిని, ఎస్సీ వర్గానికి చెంది. ప్రేమ్ చంద్ బైర్వాలను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించింది.
Read Also: PM Modi: సానుకూల అంశాలు ఉన్నాయి కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై ప్రధాని హెచ్చరిక..
భజన్ లాల్ రాజకీయ ప్రస్థానం:
జైపూర్ లోని సంగనేర్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన 54 ఏళ్ల భజన్ లాల్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన కార్యదర్శుల్లో ఈయన కూడా ఒకరు. పార్టీ అనుభవం తప్పితే, పాలనా అనుభవం పెద్దగా లేదు. నాలుగుసార్లు ఆయన బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
హార్ట్ కోర్ ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఆయనకు పేరుంది. బాబ్రీ మసీదు సమయంలో చురుకుగా పాల్గొన్నారు. 1992లో దీని కోసం జైలుకు కూడా వెళ్లారు. 27 ఏళ్ల వయసులో తొలిసారి రాజకీయ జీవితం ప్రారంభించారు. రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. గత మూడు దశాబ్ధాలుగా భారతీయ జనతా యువమెర్చా(BJYM), ఏబీవీపీలో, పార్టీలోని వివిధ పదవుల్లో పనిచేశారు.
భరత్ పూర్ జిల్లాలోని అటారీ గ్రామం, నద్‌బాయి పట్టణాల్లో పాఠశాల విద్యను అభ్యసించిన భజన్ లాల్, ఆ తర్వాత ఏబీవీలో చేరారు. 1990లో చురుకుగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు కాశ్మీర్ మార్చ్‌కి పలుపినిచ్చిన సమయంలో, ఆ విద్యార్థుల్లో భజన్ లాల్ కూడా ఉన్నారు. కాశ్మీరీ పండిట్లపై దాడులకు నిరసన నిర్వహిస్తే ఉధంపూర్‌లో ఆయనను అరెస్ట్ చేశారు.
బీజేవైఎం భరత్ పూర్ జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా, ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పొలిటికల్ సైన్స్ చదివిన భజన్ లాల్ వ్యవసాయ సరఫరాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.