NTV Telugu Site icon

Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ) దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో భాగస్వామి అయిన ఉద్ధవ్ సేన 95 సీట్లలో పోటీ చేస్తే కేవలం 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని ఠాక్రే నిరాశనను వెలిబుబ్చారు. ఇదిలా ఉంటే, రాజ్యసభ ఎంపీ, ఠాక్రే సేన నేత సంజయ్ రౌత్ మాత్రం ఓటమికి పలు కారణాలను వెతుకుతున్నారు.

మహాయుతి ఘన విజయం పట్ల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. తాజాగా తమ పార్టీ ఓటమికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కారణమంటూ ఆదివారం విమర్శలు చేశారు. ‘‘ అతను (చంద్రచూడ్) ఫిరాయింపుదారుల నుంచి చట్టం అంటే భయాన్ని తొలగించారు. అతడి పేరు నల్ల అక్షరాలతో వ్రాయబడింది’’ అని అన్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా, ఫిరాయింపుదారులకు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచారని విమర్శలు చేశారు.

Read Also: IPL Auction 2025: ప్రారంభమైన ఐపీఎల్ మెగా వేలం.. వీరిపైనే భారీ అంచనాలు

2022లో శివసేన పార్టీలో ఏక్‌నాథ్ షిండే చీలిక తీసుకువచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు షిండేకి ఉండటంతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పదవిని స్వీకరించారు. అయితే, ఇలా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ షిండే శివసేననే అసలైన శివసేనగా ప్రకటించింది. దీనిని ఉద్దేశిస్తూ రౌత్ మాజీ సీజేఐ చంద్రచూడ్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ మేము విచారంగా ఉన్నాం కానీ నిరాశ చెందలేదు. పోరాటాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టము. ఓట్ల విభజన కూడా ఒక అంశం, మరియు ఎన్నికల్లో RSS ముఖ్యమైన పాత్ర పోషించింది. విషపూరిత ప్రచారం మమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసింది’’ అని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవాన్ని పొరుగున ఉన్న గుజరాత్‌లో నిర్వహించాలని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సంజయ్ రౌత్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన 95 సీట్లలో 20 మాత్రమే గెలుచుకోగలిగింది. మొత్తం 101 స్థానాలకు గాను కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మహాయుతి గత దశాబ్ధాల రికార్డుని బద్దలు కొడుతూ మొత్తం 288 సీట్లకు గానూ ఏకంగా 233 సీట్లను గెలుచుకుంది.