BJP: తిరుగుబాటు కోసమే వియత్నాంకు రాహుల్ గాంధీ.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ.!

  • ప్రభుత్వ మార్పుకు రాహుల్ గాంధీ కుట్ర..
  • అందుకే విదేశాలకు వెళ్తున్నారు..
  • బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు..
Sambit Patra

Sambit Patra

BJP: రాహుల్ గాంధీ విదేశాల్లో తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 1న ప్రతిపక్షాలు భారీ నిరసనకు సిద్ధమవుతున్నాయని, దీని కోసం కుట్ర పన్నుతున్నారని బీజేపీ ఆరోపించింది. పదే పదే నిరసనలు చేసి ప్రభుత్వాన్ని మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని మార్చడమే ప్రతిపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయని, దానిని సాధించడానికి హింస అవసరమని చాలా మంది నాయకులు చెబుతున్నారని ఆరోపించారు.

శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ అల్బేనియా సుప్రీంకోర్టు తగలబడుతున్న ఫోటోలు షేర్ చేశారని, భారత్‌లో కూడా ఇదే జరగాలని ఆయన కోరుకుంటున్నారని అన్నారు. రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లారని తిరిగి వచ్చాక ఏం జరుగుతుందో చూడమని సంజయ్ రౌత్ వార్నింగ్ ఇస్తున్నారని సంబిత్ పాత్ర అన్నారు. దేశంలోని ప్రభుత్వాన్ని ఎలా మార్చాలో, జార్జ్ సోరోస్ ఆయన టీమ్ నుంచి శిక్షణ తీసుకోవడానికి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. కానీ ఆయన ప్రయత్నాలకు ప్రజలు మద్దతు ఇవ్వలేని చెప్పారు.

విజయ దశమి ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారని, దేశాన్ని ద్వేషించే వారు, దేశ రాజ్యాంగ సంస్థలను అపఖ్యాతి పాలు చేసేవారు దేశశత్రువులుగా సంబిత్ పాత్ర పేర్కొన్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు రాహుల్ గాంధీని రంగంలోకి దించే కుట్ర జరుగుతోందని, రాహుల్ గాంధీ విదేశాల్లో జార్జ్ సోరోస్ కుటుంబ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.