Samajwadi Party Leader Ready To Give Kidney To Mulayam Singh Yadav: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని.. పార్టీ శ్రేణులు ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి. లఖ్‌నవూలోని విక్రమాదిత్య మార్గ్‌లో ములాయం నివాసానికి కొంత దూరంలో ఉన్న హనుమాన్ ఆలయంలో, వారణాసిలోని గిలాత్ బజార్‌లోని హనుమాన్ ఆలయంలో, లొహతియాలోని బడా గణేశ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు సైతం ప్రార్థనలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధికారప్రతినిధి మనోజ్ రాయ్ మాట్లాడుతూ.. తమ ‘నేతాజీ’ ఆశీర్వాదం పార్టీలోని ప్రతిఒక్కరికీ అవసరమన్నారు. వారణాసిలోని అస్సీ ఘాట్‌లో హవన్‌తో పాటు కొన్ని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అవసరమైతే.. ములాయం కోసం తాను కిడ్నీ కూడా ఇస్తానని తమ పార్టీ నేత అజయ్ యాదవ్ ప్రకటించారని అన్నారు. మరోవైపు.. ములాయంను చూసేందుకు ఆసుపత్రికి ప్రజలు తరలివస్తుండటంతో, ఆస్పత్రి వద్దకు ఎవ్వరూ రావొద్దని సమాజ్‌వాదీ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, సీసీయూలో చికిత్స అందుతోందని పేర్కొంది. ఆసుపత్రిలో ఆయన్ను కలవడం సాధ్యం కాదు కాబట్టి, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. ఆయన ఆరోగ్యంపై సమాచారం తెలియజేస్తామని ట్వీట్ చేసింది.
ఇదిలావుండగా.. ములాయం సింగ్ ఆసుపత్రిపాలయ్యారన్న విషయం తెలిసిన వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ములాయం కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు ఫోన్ చేసి, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. దసరా తర్వాత తానే స్వయంగా వచ్చి కలుస్తానని ఈ సందర్భంగా అఖిలేష్‌కు కేసీఆర్ తెలిపారు.