Sam Pitroda: ‘‘ప్రధాని మోడీ ఫోన్లు ట్యాప్ చేయరు’’.. రాహుల్‌కు భిన్నంగా సామ్ పిట్రోడా కామెంట్స్.!

  • ప్రధాని మోడీ ఫోన్లు ట్యాప్ చేయరు..
  • రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు భిన్నంగా సామ్ పిట్రోడా కామెంట్స్..
Sam Pitroda

Sam Pitroda

Sam Pitroda: ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే, రాహుల్ వ్యాఖ్యలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సామ్ పిట్రోడా స్పందించారు. ప్రధాని మోడీ స్వయంగా ఫోన్లు ట్యాప్ చేయరని తాను భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో, తన ఫోన్ ట్యాప్ అవుతోందని, ల్యాప్‌టాప్‌పై , బ్యాంక్ అకౌంట్లపై నిఘా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని టెక్ నిపుణులతో పరిశీలించానని, వారు కూడా తన పరికరాలపై నిఘా ఉండచ్చని హెచ్చరించారని తెలిపారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సామ్ పిట్రోడా స్పందిస్తూ.. ‘‘ప్రధాని అలా చేయరు. ఆయన స్క్రూల్ డ్రైవర్ పట్టుకుని కంప్యూటర్‌ దగ్గర కూర్చుని ఫోన్లు ట్యాప్ చేయరు’’ అని అన్నారు. అయితే, తన ఫోన్ ఎవరు ట్యాప్ చేస్తున్నారనే విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

రాహుల్ గాంధీ ఏమన్నారు..?

శుక్రవార రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, దీనికి సంబంధించిన సమాచారం గురించి ముందే తెలుసని ఆరోపించారు. నాతో ముఖాముఖి చర్యకు అంగీకరించిన రోజు, విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరు ఉన్నారు.? ఎవరు దేశానికి వ్యతిరేకి?, ఎవరు దేశ వ్యతిరేఖ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? అనే విషయాలు అందరికీ తెలుస్తాయని రాహుల్ అన్నారు.

రాహుల్ ఆరోపణల్ని కొట్టిపారేసిన బీజేపీ..

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు కొట్టిపారేశారు. రాజకీయ ప్రాధాన్యం పొందేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. రాహుల్ గాందీ తన మానసిక పరిస్థితిని పరీక్షించుకోవాలని, ఆయన ఫోన్ ట్యాప్ చేయడంపై ఎవరికీ ఆసక్తి లేదని, ఆయన మెదడు రోజూ ఎందుకు అబద్ధాలు చెబుతుందని తెలుసుకోవాలనే ఆసక్తి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.