Site icon NTV Telugu

Anantnag Encounter: మళ్లీ ఫోన్ చేస్తానన్నాడు, అంతలోనే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆర్మీ అధికారుల వీరమరణం..

Jammu Kashmir

Jammu Kashmir

Anantnag Encounter:  జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా కోకెర్ నాగ్‌లో తీవ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అధికారులు వీరమరణం పొందారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ అక్కడికక్కడే మరణించగా.. మేజర్ అశిష్ ధోనాక్, డీఎస్పీ హిమయూన్ భట్ తీవ్రగాయాలతో మరణించారు. ఒక జవాన్ మరణించగా, మరో జవాన్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఇంత పెద్ద సంఖ్యలో, ముఖ్యమైన హై ర్యాంక్ అధికారులు మరణించడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. దీంతో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ వీరి మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే మరణించే కొన్ని గంటల ముందు ఆర్మీ అధికారి మాట్లాడిన మాటలను తలుచుకుంటూ వారి కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. బుధవారం ఉదయం 6.45 గంటలకు కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మళ్లీ తర్వాత ఫోన్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్ లో ఆయన మరణించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ సింగ్ బావమరిది వీరేందర్ గిల్ కన్నీరుమున్నీరయ్యారు. 41 ఏళ్ల మన్ ప్రీత్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ అధికారి.

Read Also: Mumbai Crime: బాలికపై అత్యాచారం చేశాడు.. రూ.10నోట్ ఇచ్చి నోరు మూయించాడు

మేజర్ అశిష్ ధోనక్(34)కి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు. వీరు హర్యానా పానిపట్ లో నివసిస్తున్నారు. చివరిసారిగా వీరితో టెలిఫోన్ లో మాట్లాడారు. ఒకటిన్నర నెలల క్రితం ఆయన ఇంట్లోనే ఉన్నారని, ఇళ్లు మారడానికి అక్టోబర్ నెలలో తిరిగిరావాల్స ఉందని ధోనక్ మామయ్య చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో డీఎస్పీగా పనిచేస్తున్న హిమాయున్ భట్, రిటైర్డ్ ఇన్పెక్టర్ జనరల్ గులాం హసన్ భట్ కుమారుడు. భట్ కి నెల క్రితమే కొడుకు పుట్టాడు. హియాయున్ భట్ అంత్యక్రియలు బుద్గాంలో జరిగాయి. కన్నీటిని దిగమింగుకుంటూ ఆయన తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీస్ చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులు అర్పించారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అనంత్ నాగ్ ప్రాంతంలో కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ ప్రారంభించారు.

Exit mobile version