BJP: ఉగ్రవాది ఎస్ఏ బాషా అంత్యక్రియల ఉరేగింపుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై తమిళనాడు ప్రభుత్వం, ఇండియా కూటమిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. డీఎంకే పార్టీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా బుధవారం మండిపడ్డారు. అల్-ఉమ్మర్ సంస్థ వ్యవస్థాపకుడు బాషా పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో అనారోగ్యంతో మరణించారు. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల ఘటనలో బాషా మాస్టర్ మైండ్‌గా ఉన్నాడు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.
‘‘ తమిళనాడు ఘటన షాకింగ్‌కి గురిచేస్తోంది. 1998 కోయంబత్తూర్ వరస పేలుళ్ల సూత్రధారి 58 మంది భారతీయులను హత్య చేసి, 231 మందిని గాయపరిచిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం ‘‘అమరవీరుడి’’ హోదాను ఇచ్చింది. నమాజ్ ఇ జనాజా ఒక టెర్రరిస్టుకు అనుమతించబడింది. అతడిని ప్రశంసిస్తూ నినాదాలు చేస్తుంటే పోలీసులు భద్రత కల్పించారు’’ అని పూనావాలా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇండియా కూటమి ‘‘జాతీయ భద్రత’’ కన్నా ‘‘ఓటు బ్యాంక్ భద్రత’’కు ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. అఫ్జల్ గురుని ప్రశంసించడం నుంచి ఇప్పుడు బాషా వరకు, సిమీ రక్షించడం నుంచి పీఎఫ్ఐ వరకు ఇండియా కూటమి ప్రేమ కురిపిస్తోందని పూనావాలా అన్నారు.
Read Also: Amit Shah: అంబేద్కర్‌ను గౌరవించింది మోడీ సర్కారే
ఇదిలా ఉంటే, తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై కూడా డీఎంకే ప్రభుత్వ తీరుపై బుధవారం విరుచుకుపడ్డారు. ‘‘మైనారిటీల బుజ్జగింపులో డీఎంకే ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్లిందో చూపిస్తోంది. అమాయకపు ప్రాణాలను బలిగొన్న వ్యక్తి పెరోల్ సమయంలో మరణించాడు. అతడి అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి ఇవ్వడం సిగ్గుచేటు. ఈ రోజు శాంతిభద్రతలు చచ్చిపోయినందున కోయంబత్తూర్ బీజేపీ యూనిట్ వచ్చే శుక్రవారం బ్లాక్‌డేగా పాటిస్తుంది’’ అని అన్నామలై అన్నారు.
మరోవైపు డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్, అంత్యక్రియలు కుటుంబ హక్కు అని సమర్థించారు. ఈ పాదయాత్రతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘‘అది వారి హక్కు. మృతుడి కుటుంబం అంత్యక్రియల్ని నిర్వహిస్తుంది. గాంధీ హంతకుడి పుట్టినరోజుని బీజేపీ నిర్వహిస్తుంది. ఈ ఊరేగింపుతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకరి అంత్యక్రియల్ని ఎలా ఆపగలం’’ అని ఇలంగోవన్ వ్యాఖ్యానించారు.