S Jaishankar: ‘IC 814: ది కాందహార్ హైజాక్’ నెట్‌ఫ్లిక్స్ సిరీజ్ 1999 నాటి ఖాట్మాండు-ఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్ విమానం హైజాక్ ఘటనను మరోసారి గుర్తు చేసింది. హర్కత్ ఉల్ ముజాహీదిన్‌కి చెందిన ఐదుగురు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ కంట్రోల్ కాందహార్‌కి తీసుకెళ్లారు. ఈ హైజాక్‌లో ప్రయాణికుల్ని రక్షించేందుకు అత్యంత క్రూరమైన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మసూద్ అజార్ మరియు ముష్తాక్ అహ్మద్ జర్గార్ అనే ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సీరిజ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల పేర్లు భోలా, శంకర్ అని పిలవడాన్ని హిందువులు తప్పుపట్టారు.
ఇదిలా ఉంటే, ఐసీ 814 నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐసీ 421 విమానం హైజాక్ ఘటనని గుర్తు చేసుకున్నారు. 1984లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. స్విట్జర్లాండ్ జెనీవాలో భారతీయ ప్రవాసులను ఉద్దేశిస్తూ జైశంకర్ మాట్లాడారు. ఐసీ 814 గురించి ఒకరు ప్రశ్నించగా, తనకు ఐసీ 421 హైజాక్‌లో జరిగిన సొంత సంఘటనని వివరించారు.
‘‘1984లో హైజాకింగ్ జరిగింది. నేను యువ అధికారిని. హైజాకర్లతో వ్యవహరించే బృందంలో భాగంగా ఉన్నా. హైజాక్ జరిగిన 3-4 గంటల తర్వాత, నేను రాలేనని, హైజాకింగ్ జరుగుతోందని మా అమ్మకు ఫోన్ చేసాను. ఆ ఫ్లైట్‌లో మా నాన్న ఉన్నారని తెలుసుకున్నాను. హైజాకింగ్ దుబాయ్‌లో ముగిసింది. అదృష్టవశాత్తూ, ఎవరూ చంపబడలేదు, కానీ అది తప్పుగా ముగిసి ఉండవచ్చు. ఒకవైపు హైజాకర్లతో వ్యవహరించే బృందంలో ఉండటం, మరో వైపు హైజాకింగ్‌పై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్న కుటుంబ సభ్యుల్లో భాగం కావడం ఆశ్చర్యకరంగా ఉంది.’’ అని చెప్పారు.
1984లో ఏం జరిగింది..?
ఆగష్టు 24, 1984న, ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 421 ఢిల్లీ విమానాశ్రయం నుండి చండీగఢ్ మరియు జమ్మూ మీదుగా శ్రీనగర్‌కు బయలుదేరింది. చండీగఢ్‌లో విమానం దిగగానే నిషేధిత ఆల్ ఇండియా సిక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్న ఏడుగురు హైజాకర్‌లు బోయింగ్ 737-2A8 విమానం కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను విడుదల చేయాలని కోరుతూ విమానాన్ని హైజాక్ చేశారు. వారిని కూడా అమెరికాకు తరలించాలని డిమాండ్ చేశారు.
36 గంటల పాటు జరిగిన ఈ హైజాక్‌లో విమానం పఠాన్ కోట్, లాహోర్, కరాచీ, చివరకు దుబాయ్‌కి చేరింది. చివరకు హైజాకర్లు అందరూ అధికారులకు లొంగిపోయారు. దీంతో 68 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది క్షేమంగా విడుదలయ్యారు. హైజాక్ అయిన విమానంలోనే జైశంకర్ తండ్రి, సివిల్ సర్వెంట్ కే. సుబ్రమణ్యం ఉన్నారు. జైశంకర్ తండ్రి ఐఏఎస్ అధికారి. ఇందిరాగాంధీతో పాటు అనేక మంది ప్రధానులతో పనిచేశారు.