S-400 Sudarshan Chakra: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ పెంపుడు ఉగ్రవాదుల్ని భారత్ నాశనం చేసింది. దీంతో రగిలిపోతున్న దాయాది భారతదేశంలోని 15 నగరాలపై డ్రోన్, క్షిపణి దాడులకు ప్రయత్నించి భంగపడింది. ముఖ్యంగా, సరిహద్దుల్లో ఉన్న అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరాలాయ్, భుజ్‌లతో సహా అనేక సైనిక లక్ష్యాలపై దాడులకు యత్నించింది.
ఈ దాడుల్ని భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ముఖ్యంగా, రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ట్రయంఫ్ మిస్సైల్ సిస్టమ్ భారత్‌కి సుదర్శన చక్రం వలే రక్షణ ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి దూసుకువస్తున్న డ్రోన్లు, క్షిపణుల్ని అడ్డుకుని, గాలిలోనే ధ్వంసం చేసింది. పాక్ క్షిపణులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు న్యూట్రలైజ్ చేసినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
S-400 సుదర్శన్ చక్ర అంటే ఏమిటి?
భారత్, రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400కి ‘‘S-400 సుదర్శన చక్ర’’గా నామకరణం చేసింది. ప్రస్తుత ప్రపంచంలో అత్యున్నతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఇది ముందు వరసలో ఉంది. యూఎస్ ఆంక్షలను ధిక్కరించి భారత్ రష్యా నుంచి ఈ వ్యవస్థని కొనుగోలు చేసింది. భారత్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ రష్యా నుంచి ఐదు స్వ్కాడ్రన్లను కొనుగోలు చేశాయి. 2026 నాటికి మరో రెండు స్వ్కాడ్రన్లు అందుబాటులోకి రానున్నాయి. ఐదు S-400 స్క్వాడ్రన్‌ల కోసం రూ. 35,000 కోట్ల ఒప్పందం 2018లో సంతకం చేయబడింది.
ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన దీర్ఘ శ్రేణి వాయు రక్షణ వ్యవస్థల్లో ఇది ఒకటి. ఐఎఎఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్‌తో అనుసంధానించబడిన ప్రతీ S-400 స్క్వాడ్రన్‌లో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒక్కొక్కటి ఆరు లాంచర్లను, అధునాతనమైన రాడార్లను కలిగి ఉంటుంది. ఒక్కో బ్యాటరీలో 128 క్షిపణుల సపోర్ట్ ఉంటుంది.
S-400 సుదర్శన్ 400 కి.మీ వరకు శత్రువులు ప్రయోగించే వైమానిక ముప్పులను ముందే పసిగట్టి, కౌంటర్ ఎటాక్ చేస్తుంది. ఇది స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల్ని ట్రాక్ చేసి, మార్గం మధ్యలోనే కొట్టేస్తుంది. తాజాగా, పాకిస్తాన్ దాడిని S-400 వ్యవస్థ తిప్పికొట్టి తన సత్తాను మరోసారి నిరూపించుకుంది.