Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..

  • రష్యా చమురు కొనుగోళ్లపై భారత్, చైనాలకు అమెరికా నుంచి మరోసారి హెచ్చరిక.
  • విధానం మార్చుకోవాలని రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ వార్నింగ్.
  • రష్యాపై ఆంక్షల బిల్లుకు యూఎస్ చట్టసభ ఆమోదం.
  • రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్ విధించే అవకాశం.
Us Warns India

Us Warns India

Russia Oil: అమెరికా కాంగ్రెస్ రష్యాపై కొత్త ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలిపింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే భారత్, చైనాలపై 100 శాతం టారిఫ్ ముప్పు పొంచి ఉంది. ఇదిలా ఉంటే, మరోవైపు రెండు దేశాలనను అమెరికా బెదిరించే ప్రయత్నం చేస్తోంది. భారత్, చైనాలపై డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీసుకువస్తోంది. ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారీ ఆర్థిక చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని అమెరికా నుంచి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి.

రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ భారత్, చైనాలను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ విధానాన్ని మార్చుకోండి, చమురు, గ్యాస్ వేరే చోట నుంచి కొనండి’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చి ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడమే ఈ ఆంక్షల లక్ష్యమని బ్లూమెంటాల్ చెప్పారు.

అమెరికా కాంగ్రెస్ బుధవారం రష్యా, ఇరాన్‌పై ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ట్రంప్ సంతకమే మిగిలుంది. బిల్లులో రష్యా అధికారులు, బ్యాంకులు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా చమురును రవాణా చేస్తున్నట్లు భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై చర్యలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఇదే కాకుండా రష్యా చమురు, సహజవాయువుపై ఆధారపడే ప్రధాన దేశాలపై 100 శాతం వరకు టారిఫ్ వేసే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇస్తుంది. అయితే, ఈ టారిఫ్‌లు ఆటోమెటిక్‌గా అమలులోకి రావు. ఈ చట్టాన్ని అమెరికా అధ్యక్షుడు ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

మరోవైపు, భారత్ అమెరికా చర్యలపై ఘాటుగా స్పందించింది. దేశంలోని 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతే తమ ప్రధాన లక్ష్యమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిద దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని భారత్ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో, రష్యా తన చమురును డిస్కౌంట్‌పై అమ్ముతోంది. అప్పటి నుంచి రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది.