NTV Telugu Site icon

RSS On Bangladesh: బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిపై స్పందించిన ఆర్ఎస్ఎస్..

Rss On Bangladesh

Rss On Bangladesh

RSS On Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త మద్దతు కూడగట్టాలని, అందుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పిలుపునిచ్చింది. అన్యాయంగా నిర్బంధించిన హిందూ సన్యాసి, ఇస్కాన్ మాజీ నేత చిన్మోయ్ కృష్ణదాస్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జరుగుతున్న హింసను ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఖండించారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా ప్రభుత్వం హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసకు ‘‘నిశ్శబ్ధ ప్రేక్షకుడిగా’’ ఉందని ఆయన ఆరోపించారు.

Read Also: ACB Raids: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు

ఇటీవల ఢాకా నుంచి ఛటోగ్రామ్ వెళ్తున్న చిన్మోయ్ కృష్ణదాస్‌ని ఢాకా విమానాశ్రయంలో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మహిళలు, ఇతర మైనారిటీలందరిపై ఇస్లామిక్ ఛాందసవాదులు చేస్తున్న దాడులు, హత్యలు, దోపిడీలు, దహనం, అమానవీయ దౌర్జన్యాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిని ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

బంగ్లాదేశ్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగించాలని హోసబాలే నొక్కి చెప్పారు. హిందువుల్ని రక్షించడానికి దౌత్యపరమైన చర్యల్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అక్కడి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు మైనారిటీలను ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి. హిందువుల ఆస్తులు, ఆలయాలు, వ్యాపారాలపై దాడులు చేస్తున్నారు. హిందూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలను రక్షించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.

Show comments