NTV Telugu Site icon

Waqf Bill: నితీష్ కుమార్ పార్టీలో ‘వక్ఫ్ బిల్లు’ కల్లోలం.. రెండుగా చీలిన నేతలు..

Waqf Bill

Waqf Bill

Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాల’కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో, జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ ఈ బిల్లుకు లోక్‌సభలో మద్దతు ప్రకటించింది. కాగా, క్షేత్రస్థాయిలో మాత్రం నితీష్ కుమార్‌కి చెందిన జేడీయూ పార్టీలో ‘వక్ఫ్ బిల్లు’ చీలికలువ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై పార్టీ నేతలు రెండుగా చీలిపోయారు.

Read Also: Japan: జపనీయులను వెంటాడుతున్న సునామీ భయం.. వెలవెలబోతున్న షాపింగ్ మాల్స్

ఇటీవల బిల్లుకు జేడీయూ ఎంపీ, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మద్దతు తెలిపారు. ఇది వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకతను తీసుకురావడానికి తెచ్చిన బిల్లుగా పేర్కొన్నారు. ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ బిల్లు మసీదు లేదా దేవాలయానికి సంబంధించింది కాదని, వక్ఫ్ బోర్డుల పారదర్శకతను ప్రోత్సహించడానికి తెచ్చినదని చెప్పారు. అయితే, రంజన్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ నేత, మాజీ ఎమ్మెల్సీ గులాం గౌస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 7 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న వక్ఫ్ బోర్డు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఈ బిల్లు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా బీజేపీ ఈ బిల్లుని తీసుకువచ్చిందని అన్నారు. వక్ఫ్ భూముల్ని లాక్కోవడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు.

మరో జేడీయూ నేత, ముఖ్యమంత్రి కీలక సహాయకుడు విజయ్ కుమార్ చౌదరి వక్ఫ్ బిల్లును జేపీసీకి పంపాలన్న కేంద్ర నిర్ణయాన్ని ప్రశంసించారు. మైనారిటీ కమ్యూనిటీలో ఈ బిల్లుపై భయాలు ఉన్నాయని, అయితే జేపీసీ పరిశీలనకు పంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మైనారిటీ వర్గాలకు సంబంధించిన సమస్యలను అత్యంత సున్నితత్వంతో పరిష్కరించాలని మా నేత నితీష్ కుమార్ నమ్ముతారని అన్నారు. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు నితీస్ కుమార్ పార్టీ నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.