CM Revanth Reddy: తుంగభద్ర డ్యామ్ 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని పేర్కొన్న ఆయన, భారతదేశంలో ఉన్న కొద్దిమంది ప్రముఖ నాయకుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరని ప్రశంసించారు. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ వల్ల అనంతపురం, కర్నూలు, పాలమూరు ప్రాంతాల్లోని లక్షలాది మంది రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల సమస్యలతో పాటు పాలమూరు వలసల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఈ ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నీటి వనరుల నిర్వహణలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో మూడు రాష్ట్రాల నీటి సమస్యలను ప్రస్తావించామని తెలిపారు రేవంత్ రెడ్డి… కేంద్రంలో సీఆర్ పాటిల్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నీటి వాటాల విషయంలో అన్ని రాష్ట్రాల హక్కులను పరిరక్షిస్తూ కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని చెప్పారు. గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాలకు సంబంధించిన రాజోలిబండ డైవర్షన్ స్కీంకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ, ప్రస్తుతం కేవలం ఐదు నుంచి ఆరు టీఎంసీల నీటినే రైతులు వినియోగించుకుంటున్నారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాస్తవానికి రావాల్సిన నీరు కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తుంగభద్రలో నీటి కూడిక, తరలింపు, పంపకాల విషయంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు రేవంత్.. ఈ అంశాలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న ఈ చర్చలు భవిష్యత్తులో చారిత్రాత్మక నిర్ణయాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఇక, మైసూరు మహారాజు, నిజాం నవాబు దూరదృష్టితో నిర్మించిన తుంగభద్ర డ్యామ్ నేటికీ లక్షలాది మంది ప్రజలకు జీవనాధారంగా నిలుస్తోందని అన్నారు. మూడు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం కీలక మలుపు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

