NTV Telugu Site icon

Reasi bus attack: రియాసి బస్ అటాక్.. ఎన్ఐఏ సోదాల్లో కీలక విషయాలు..

Reasi Bus Attack

Reasi Bus Attack

Reasi bus attack: రియాసిలో బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అంతకుముందు ఈ కేసును జూన్ 15న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విచారణను ఎన్ఐఏకి అప్పగించింది. రియాసి జిల్లాలోని శివ్ ఖోరి నుంచి మాతా వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది మరణించగా, 41 మంది గాయపడ్డారు.

Read Also: Andhra Pradesh: ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా

ఈ కేసులో హైబ్రీడ్ ఉగ్రవాదులకు స్థానికంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారితో సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీరితో సంబంధం ఉన్న ఐదు ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. అరెస్టైన టెర్రరిస్ట్ హకమ్ ఖాన్ దాడికి సంబంధించిన లొకేషన్లను కాల్పులు జరిపిన ఉగ్రవాదులకు చూపించాడు. జూన్ 9న జరిగిన ఈ దాడిలో ఉగ్రవాదులకు హకమ్ సురక్షిత ఆశ్రయం, లాజిస్టిక్, ఆహారాన్ని అందించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దాడికి గురైన యాత్రికుల్లో ఎక్కువ మంది రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ నుంచి వచ్చారు.

సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులకు ఉగ్రవాదులకు, స్థానికంగా ఉగ్రవాద సానుభూతిపరులుగా ఉన్న వారికి మధ్య సంబంధాలను చూపించే కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 50 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులో ఉన్నారు. పూంచ్‌లో మే 4న భారత వైమానిక దళ కన్వాయ్‌పై దాడి చేసిన అదే పాకిస్తానీ టెర్రరిస్టులు ఈ దాడిలో కూడా పాల్గొన్నట్లు ఇంటెజెన్స్ ఇన్‌పుట్స్ ఉన్నాయి. ఈ దాడికి ముందుగా లష్కరేతోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత ప్రకటించుకుంది. ఆ తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకుంది.