ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2017లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.. బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో జరిగిన దుర్ఘటనలో ఏకంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.. దీనికి ప్రధాన కారణం ఆక్సిజన్ కొరత కావడం పెద్ద రచ్చగా మారింది.. ఈ ఘటనలో యోగి ఆదిత్యానాథ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయితే, దీనికి బాధ్యున్ని చేస్తూ డాక్టర్ కఫీల్ ఖాన్‌పై వేటు వేశారు.. ఆయన చివరకు జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది.. ఎందరి నుండో బెదరింపులను ఎదుర్కొన్నారు.. అయితే, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో అనూహ్యంగా ఆయన తెరపైకి వచ్చారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీకి తాను సిద్ధమని వెల్లడించారు.. గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను.. ఏ పార్టీ అయినా నాకు టిక్కెట్ ఇస్తే పోటీకి నేను రెడీ అని ప్రకటించారు..
గోరఖ్‌పూర్‌లో 2017 ఆగస్టులో జరిగిన దుర్ఘటనలో తనను బలిపశువు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ ఖాన్.. ఇప్పటికీ తనపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయన్న ఆయన.. పోలీసులు పదే పదే తమ ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.. కాగా, ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన కేసులో డాక్టర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు జైలు జీవితాన్ని గడిపారు.. ఇక, రెండు సార్లు సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చింది.. ఆ తర్వాత ఆస్పత్రిలో జరిగిన ఘటన.. తనకు ఎదురైన పరిణామాలను పొందుపరుస్తూ.. ‘ది గోరఖ్‌పూర్ హాస్పిటల్ ట్రాజెడీ- ఏ డాక్టర్స్ మెమోయిర్ ఆఫ్ ఎ డెడ్లీ మెడికల్ క్రైసిస్’ పేరుతో పుస్తకం కూడా రాశారాయన.. కేవలం పాలకుల నిర్లక్ష్యం కారణంగానే గోరఖ్‌పూర్ దుర్ఘటన జరిగిందన్న ఆయన.. కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని.. దాని కారణంగానే 54 గంటల వ్యవధిలో 80 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారని చెప్పుకొచ్చారు. కానీ, నిజాలను దాచి.. నన్ను బలిపశువును చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.