Site icon NTV Telugu

Article 370 hearing: జమ్మూ కాశ్మీర్‌లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధం.. సుప్రీంకు తెలిపిన కేంద్రం

Article 370

Article 370

Article 370 hearing: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్ , సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 370 పిటిషన్ ను విచారిస్తోంది.

జమ్మూకాశ్మీర్ లో ఎప్పుడైనా ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. అయితే ఈ నిర్ణయం ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానిదే అని ప్రభుత్వం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని ఇతర రాష్ట్రాలతో పోల్చలేమని, విభజన అవసరమని గతంలో కేంద్రం వాదించింది. మంగళవారం జరిగిన విచారణలో, జూన్ 2018 నుంచి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నుకోబడిన ప్రభుత్వం లేకుండా ఉందని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. ఇదిలా ఉంటే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి నిర్ధిష్ట గడవు ఇవ్వలేమని కేంద్రం, సుప్రీంకోర్టుకు తెలిపింది.

Read Also: Ramya Krishna : నేటి తరం హీరోయిన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రమ్య కృష్ణ..

ఈ రోజు జరిగిన విచారణలో 2018 నుంచి 2023తో పోలిస్తే ఉగ్రవాద కేసులు 45.2 శాతం తగ్గాయని, చొరబాట్లు 90 శాతం తగ్గాయని కేంద్రం, సుప్రీం కోర్టుకు తెలియజేసింది. రాళ్ల దాడులు, లా అండ్ ఆర్డర్ సమస్యలు 97 శాతం తగ్గాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు తెలియజేశారు. భద్రత సిబ్బంది ప్రమాదాలు 65 శాతం తగ్గాయని, 2018లో రాళ్ల దాడులకు సంబంధించిన కేసులు 1767 నమోదైతే ఇప్పుడు అది శూన్యానికి చేరుకుందని, 2018లో 52 సార్లు బందులు ఉంటే ఇప్పుడు బంద్‌లు లేవని తెలియజేశారు.

2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రం చెప్పింది. హోంమంత్రి అమిత్ షా కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు కానీ అలాంటి చర్యకు ఎలాంటి గడువు విధించలేదు.

Exit mobile version