Rare Brain Infection: అత్యంత అరుదుగా సోకే అమీబా ఇన్ఫెక్షన్ కేసు కేరళలో నమోదైంది. నీటిలో ఉండే అమీబా శరీరంలోకి ప్రవేశించిన సమయంలో ఈ ఇన్ఫెక్షన్ కలుగుతుంది. అలప్పుజాలోని పానవల్లి ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడికి వ్యాధి సోకింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యాధి మొదటిసారిగా 2017లో అలప్పుజా మునిసిపాలిటీ ప్రాంతంలో నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడే మరో కేసు నమోదు అయింది.
Read Also: Modi surname Case: రాహుల్ గాంధీకి భారీ షాక్.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు..
‘ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’ అని పిలిచే ఈ వ్యాధి నీటిలో ఉండే అమీబా వర్గానికి చెందిన క్రిముల ద్వారా వ్యాపిస్తుంది. కాలువలు, కొలనుల్లో స్నానం చేసే సమయంలో ఈ పరాన్న జీవి ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మెదడువాపుకు కారణమవుతుంది. జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్చ ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.
కలుషితమైన నీటిలో స్నానం చేయడం, ముక్కు, నోటిని కడుక్కోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు కలుషిత నీటిలో స్నానాలు చేయవద్దని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సూచించారు.