NTV Telugu Site icon

Ranya Rao: పొలిటికల్ టర్న్ తీసుకున్న రన్యారావు కేసు.. భూ కేటాయింపుపై రగడ

Ranyarao

Ranyarao

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావు కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రన్యా రావు సంస్థకు భూమి కేటాయింపుపై అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

గత కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశాన్ని రన్యారావు కేసు కుదిపేస్తోంది. దాదాపు రూ.17 కోట్ల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ నటి రన్యారావు డీఆర్ఐ అధికారులకు పట్టుబడింది. ఆమె ఇంట్లో సోదాలు చేయగా… కోట్ల విలువైన ఆభరణాలతో పాటు భారీగా నగదు లభ్యమైంది. అప్పటి నుంచి ఈ కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.

తాజాగా ఆమెకు సంబంధించిన సంస్థకు భూకేటాయింపు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ చేసింది. బీజేపీ హయాంలోనే ఆమె సంస్థకు భూకేటాయింపు జరిగినట్లుగా ఆధారాలతో బయటపెట్టింది. 2023, మే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ఆమెకు బీజేపీ పాలనలో భూకేటాయింపు జరిగినట్లు తెలిపింది.

2023, జనవరిలో రన్యారావు సంస్థకు భూకేటాయింపు జరిగింది. కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు తుమకూరు జిల్లాలో రన్యా రావుతో సంబంధం ఉన్న ఒక సంస్థకు భూమిని కేటాయించినట్లు అంగీకరించింది. అయితే ఈ భూకేటాయింపు బీజేపీ పాలనలో జరిగిందని స్పష్టం చేసింది. రూ.138 కోట్లతో ఉక్కు తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు రన్యారావు ప్లాన్ చేసింది. ఈ సంస్థ ఏర్పాటు కోసం 12 ఎకరాల ప్రారిశ్రామిక భూమిని రన్యారావు పొందినట్లుగా బోర్డు పేర్కొంది.

మధ్యతరహా మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ. పాటిల్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 22, 2023 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్‌తో పాటు.. రన్యా రావు సంస్థ క్సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమి కేటాయింపు జరిగినట్లు పేర్కొన్నారు. తుమకూరు జిల్లాలోని సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో 12 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 160 ఉద్యోగాలు లభిస్తాయని ఆ సంస్థ తెలిపినట్లుగా చెప్పారు.

రన్యారావు తండ్రి ఐపీఎస్ అధికారి రామచంద్రరావు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర పోలీసు హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే కుమార్తె బంగారం స్మగ్లింగ్ కేసులో దొరకడంపై గుండె పగిలినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను అక్రమంగా తరలించినందుకు రన్యారావును అరెస్టు చేశారు. తాజాగా ఈ అంశం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. బెంగళూరులోని ఆమె నివాసంలో సోదాలు చేయగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు లభించాయని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తెలిపింది.