NTV Telugu Site icon

CAA: ‘‘ఇది మాకు రామరాజ్యం’’..సీఏఏపై పాక్ హిందూ శరణార్థులు..

Caa

Caa

CAA: కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని నోటిఫై చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ఈ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోంది.

Read Also: Kangana Supports CAA: మోడీని మరో సారి ఆకాశానికి ఎత్తిన కంగనా రనౌత్.. సీఏఏకు పూర్తి మద్దతు

దీని ప్రకారం డిసెంబర్ 31, 2014కంటే ముందు భారత్‌కి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్కు, పార్సీ, జైన, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం రానుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ నుంచి ఇండియాకు వచ్చిన హిందువులు హర్షిస్తున్నారు. రాజస్థాన్ జోధ్‌పూర్ వారంతా వేడుకలు నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇది మాకు నిజమైన రామరాజ్యం లాంటిది’’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

‘‘మేము దీని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. ఇది (CAA) నిజం కావడంతో, పౌరసత్వం కోసం చూస్తున్న చాలా మంది త్వరలో భారతీయ పౌరులుగా మారాలని ఆశిస్తున్నారు’’ అని పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ వలసదారు దినేష్ భీల్ అన్నారు. భారత్‌లో నివసించిన ఆరు ఏళ్ల తర్వాత మేము పౌరసత్వం పొందుతున్నామని మరో వలసదారు పెరుమాళ్ అన్నారు. ఒక్క జోధ్‌పూర్ లో సుమారు 35,000 మంది వలసదారులు పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. గత 10 ఏళ్లలో పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి హిందూ వలసదారుల ప్రవాహం పెరిగింది. పాకిస్తాన్ లోని సింధ్ నుంచి హిందూ వలసదారులు రాజస్థాన్ లోని బార్మర్, బికనేర్, జోధ్‌పూర్‌లకు వచ్చి నివసిస్తున్నారు.