NTV Telugu Site icon

Maharashtra: నిన్న ఫడ్నవిస్‌తో ఉద్ధవ్ థాక్రే.. నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ.. ఎంవీఏలో ఏం జరుగుతోంది!?

Maharashtra

Maharashtra

మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి మాత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కింది. దేవేంద్ర ఫడ్నవిస్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలు అయ్యారు.

ఇదిలా ఉంటే మహా వికాస్ అఘాడీ కూటమి పరాజయం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కూటమి నేతలు.. అధికార పార్టీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అడుగులు మెల్లమెల్లగా మహాయుతి వైపు పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం అనూహ్యంగా ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ను కలిశారు. భేటీ అనంతరం ఆదిత్య థాక్రే మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు ఇదొక ముందడుగు అని తెలిపారు. ఏ కూటమిలో ఉన్నా.. ప్రజాప్రతినిధులుగా.. అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఫడ్నవిస్‌తో ఉద్ధవ్ థాక్రే కలిసి కొన్ని గంటలైనా గడవక ముందే.. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. మహారాష్ట్ర రైతులతో కలిసి ప్రధానిని కలిశారు. అయితే భేటీ ఉద్దేశాలు వేరైనా.. ప్రతిపక్ష నేతల వరుస భేటీలు మాత్రం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ నేతలు.. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం కేంద్రం.. ఎంతో ప్రతిష్టాత్మకమైన జమిలి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందేందుకు ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ పార్టీ ఎంపీలను కలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కూడా ఈ విధమైన సంకేతం ఇచ్చారు. త్వరలో శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. బీజేపీలో చేరొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.