Rajasthan: ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని నవంబర్ 30తో ముగించి, డిసెంబర్ 3న ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి చూపు ఈ ఎన్నికలపై ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని సవరించినట్లు ప్రకటించింది. నవంబర్ 23న ఓటింగ్ జరగాల్సి ఉంటే దీన్ని నవంబర్ 25కి మార్పింది. జోధ్‌పూర్ ఎంపీ పీపీ చౌదరితో పాటు పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఆ రోజు దేవ్ ఉతాని ఏకాదశి ఉండటంతో పోలింగ్ తేదీని మార్చాలని కోరారు. పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్లు ఆ రోజున ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో పోలింగ్ తగ్గే అవకాశం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. కారుతో క్యాబ్ డ్రైవర్నిని ఈడ్చుకెళ్లారు..
వివాహ రద్దీ, ఎన్నికలు ఒకేసారి జరిగితే రవాణా సౌకర్యాలకు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని, పోలింగ్ లో ఓటర్ల భాగస్వామ్యం తగ్గే అవకాశం ఉందని ఈసీ వెల్లడించింది. దీంతో పోలింగ్ తేదీని నవంబర్ 23 నుంచి 25కి మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది. బీజేపీ ఈ సారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది.