Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించకుండా, చట్ట ప్రకారం జరిగే వ్యాపారాలను పట్టించుకోకపోవడంతో.. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అవలంభించే ఇలాంటి చర్యలతో దేశంలో తయారీ రంగం రోజురోజుకు మరింత బలహీనపడుతోంది, కరెన్సీ విలువ క్రమంగా పడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రికార్డు స్థాయిలో గరిష్ఠ వాణిజ్య లోటు, అధిక వడ్డీ రేట్లు పెరిగాయని పేర్కొన్నారు. వస్తువుల వినియోగం తగ్గి ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి చూస్తున్నామని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Read Also: Seethakka In Assembly: గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై స్పందించిన మంత్రి సీతక్క
అయితే, దేశంలో వాణిజ్య లోటు, దిగుమతులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోతున్నాయని వస్తున్న వార్తా కథనాలను గుర్తు చేస్తూ.. కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు క్రోనీ క్యాపిటలిజం విధానాలకు ప్రాధాన్యమిస్తే ఎలా అని ప్రశ్నించారు. గత నవంబరులో దేశీయ వాణిజ్య ఎగుమతులు ఏడాది క్రితం ఇదే నెలతో పోలిస్తే 4.85 శాతం తగ్గి 32.11 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాని చెప్పుకొచ్చారు. అలాగే, దిగుమతులు 27 శాతం పెరిగి రికార్డు స్థాయి 69.95 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొన్నారు. దీంతో వాణిజ్య లోటు 37.84 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. ఇది జీవనకాల గరిష్ఠ స్థాయి అని రాహుల్ గాంధీ వెల్లడించారు.