Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!

  • 2014 ఎన్నికల్లోనే ఏదో తప్పు జరిగిందని భావించా..
  • ఎన్నికల్ని బహిష్కరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం..
  • చికాగో యూనివర్సిటీలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. చికాగో యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో భారత ఎన్నికల వ్యవస్థపై కామెంట్స్ చేశారు. ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని భావిస్తే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్ని ఎందుకు బహిష్కరించలేదని ఒక విద్యార్థి రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రాహుల్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లోనే ఏదో తప్పు జరిగిందని తాము భావించామని, కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటముల మెజారిటీలు వివరించలేనివిగా ఉన్నాయని ఆయన అన్నారు. అయితే, అప్పట్లో తమ వద్ద ఆధారాలు లేకపోవడంతో రాజకీయంగా ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోయామని అన్నారు.

కాంగ్రెస్ లోని రాజకీయ నాయకులకు ఆధారాలు చూపించినప్పటికీ, ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని వారు తనకు సూచించినట్లు రాహుల్ వెల్లడించారు. భారత ప్రజాస్వామ్యం తమకు పవిత్రమైందని, ప్రజాస్వామ్యంలో సమస్య ఉందని చెప్పాలంటే 300 శాతం ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని ఆయన అన్నారు.

ఎన్నిలక బహిష్కరణపై..

ఎన్నికల బహిష్కరణపై మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయిస్తే, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వేలాది మంది కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడం ఆపేస్తే ఆ క్షణమే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్లు అవుతుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణాన్ని తాము విచ్ఛిన్నం చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వ్యవస్థలోని లోపాలు బయటపెట్టడం తమ వ్యూహమని, భారత ప్రజలు ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని గుర్తించే వరకు తాము ఎదురుదెబ్బలు ఎదుర్కొంటూనే పోరాటం కొనసాగిస్తామన్నారు.

ఎన్నికల సంఘం అధికార పార్టీ బీజేపీతో కుమ్మకై పనిచేస్తోందంటూ అందులోని సీనియర్ అధికారులు తమకు అంతర్గత సమాచారం అందిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీకి చెందిన సీనియర్ మంత్రులు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, తమకు సమాచారం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.