Rahul Gandhi spreading divisive agenda, says BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూ కాశ్మీర్ చేరుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తోంది. రాహల్ గాంధీ విభజన ఎజెండాను వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆరోపించారు. ఆయన పాకిస్తాన్ ఐఎస్ఐ భాష మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ట గాంధీ వంశం భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదం నుంచి జమ్మూ కాశ్మీర్ టూరిజంలోకి మారిందని రాహుల్ గాంధీ గ్రహించాలని కోరారు. కాశ్మీర్ ప్రజలు కొత్త జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారని అన్నారు.
Read Also: Parakram Diwas: అండమాన్ దీవులకు పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు..
గతంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ముఫ్తీలు, అబ్దుల్లాల కుటుంబంపై విమర్శలు గుప్పించారు తరుణ్ చుగ్. వీరంతా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఉగ్రవాద రాజధానిగా మార్చారని ఆరోపించారు. బీజేపీ కాశ్మీర్ ప్రజలకు కొత్త విజన్ అందించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ఎజెండాకు అనుకూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమ నిర్ణయాన్ని ప్రకటించారని.. రాహుల్ గాంధీ దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.
కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో యాత్రం తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ చేరింది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలి ప్రాంతాల గుండా ఈ యాత్ర 3570 కిలోమీటర్ల మేర 5 నెలల పాటు సాగుతోంది. జమ్మూకాశ్మీర్ లో జనవరి 30న ఈ యాత్ర ముగుస్తుంది.
