Unnamed Islands Of Andamans To Be Named After Param Vir Chakra Awardees: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు జనవరి 23న భారతదేశం ‘పరాక్రమ్ దివాస్’ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని పేరులేని 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. జనవరి 23న ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, 2018లో ప్రధాని మోదీ అండమాన్ నికోబార్ దీవుల్లోని రాస్ ఐలాండ్ కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ గా పేరుపెట్టారు. నీల్, హావ్ లాక్ ద్వాపాలకు షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్ గా పేర్లు పెట్టారు.
ప్రస్తుతం పేరు లేని 21 దీవులకు మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్- గౌరవ కెప్టెన్ కరమ్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్, కంపెనీ హవల్దార్ మేజర్ పీరు సింగ్, కెప్టెన్ జిఎస్ సలారియా, లెఫ్టినెంట్ కల్నల్ ధన్ సింగ్ థాపా, సుబేదార్ జోగిందర్ సింగ్, మేజర్ షైతాన్ సింగ్, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్, లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్,
లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజర్ హోషియార్ సింగ్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయబ్ సుబేదార్ బానా సింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ (రిటైర్డ్) పేర్లను పెట్టనున్నారు.
దేశంలో నిజజీవితంలోని హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి ప్రధాన మంత్రి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) పేర్కొంది. పేరు లేని అతిపెద్ద ద్వీపానికి మొదటి పరమవీర చక్ర అవార్డు గ్రహీత, రెండవ అతిపెద్ద ద్వీపానికి రెండ పరమవీర చక్ర అవార్డు గ్రహీత పేరుపెట్టనున్నారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత కాపాడేందుకు త్యాగం చేసిన వీరులకు ఇది శాశ్వత నివాళి అని పేర్కొంది.