NTV Telugu Site icon

Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించినట్లే….

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. డాలస్‌లోని ప్రవాస భారతీయులతో సమావేశం అయ్యారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భాషలు, సంప్రదాయాల పేరుతో ఎవర్నీ వేరు చేసి చూడొద్దని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు లాంగ్వెజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జాతీయగీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుంది.. సమానంగా చూపిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేగానీ, ఒక రాష్టం బెస్ట్‌.. మరో రాష్ట్రం సెకండ్‌ బెస్ట్‌ అని అందులో ఎక్కడా ఉండదన్నారు. ఈ గీతం మన దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా చెప్తుందన్నారు. అప్పుడు ఒక రాష్ట్రం కంటే ఇంకో రాష్ట్రం ఎక్కువా కాదు.. తక్కువా కాదు. అలాగే భాష, సంప్రదాయాల్లో కూడా.. తమిళం మాట్లాడేవారు మాకు నచ్చరు అని.. హిందీ మాట్లాడేవారే ఇష్టమని మనం చెప్పడం కరెక్ట్ కాదు అని రాహుల్‌ గాంధీ కామెంట్స్ చేశారు.

Read Also: Rishabh Pant: భారత క్రికెట్ అభిమానుల వల్లే ఆ బంతి సిక్స్ వెళ్లలేదు.. టీ20 ప్రపంచకప్‌పై పంత్!

ఇక, తెలుగునే తీసుకోండి.. మనం తెలుగు అని చెప్తున్నాం అది కేవలం భాష కాదు.. ఒక చరిత్ర, ఒక సంప్రదాయం, సంస్కృతి అని రాహుల్ అన్నారు. అలాగే, హిందీతో పోలిస్తే తెలుగు భాష అంత ముఖ్యం కాదని ఒకవేళ ఆ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్తే.. వారిని మీరు అవమానించినట్లే.. అలా పోలుస్తూ.. తెలుగు చరిత్ర, అక్కడి ప్రజల సంప్రదాయం, సంస్కృతి, పూర్వీకులు ముఖ్యం కాదని మీరు చెప్పినట్లేనని కాంగ్రెస్‌ సీనియర్ నేత అన్నారు. ఈ చిన్న తేడాను కొందరు అర్థం చేసుకోకపోవడం వల్లే భారత్‌లో దీని కోసం పోరాటం జరుగుతోందంటూ భారతీయ జనతా పార్టీపై రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు.

Show comments