Site icon NTV Telugu

Kiren Rijiju: రాహుల్ గాంధీ పిల్లవాడు కాదు, దేశ ప్రతిష్టకు హాని కలిగించొద్దు..

Kiren Rijiju

Kiren Rijiju

Kiren Rijiju: భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమర్థించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’అని ట్రంప్ చెప్పడాన్ని రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. అయితే, ఈ విషయంపై కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఆయనను విమర్శించారు. ప్రతిపక్ష నేత ‘‘చిన్నపిల్లవాడు కాదు’’ అని, దేశ ప్రతిష్టను ఈ విధంగా దెబ్బతీయకూడదని తెలుసుకోవాలని హితవు పలికారు.

‘‘రాహుల్ గాంధీ దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇది సరైనది కాదని ప్రతిపక్షానికి చెందిన పలువురు సభ్యులు కూడా అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రతిష్టను ఇలా దెబ్బతీయకూడదు’’ అని రిజిజు శుక్రవారం అన్నారు. ‘‘ఆయన(రాహుల్ గాంధీ) చిన్నపిల్లవాడు కాదని అర్థం చేసుకోవాలి. దేశ గౌరవం, ప్రతిష్టను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతిపక్ష నాయకుడికి ఇంత అవగాహన ఉండాలి’’ అని చెప్పారు.

Read Also: National Film Awards 2025: ఉత్తమ నటుడు అవార్డు ఇద్దరికి.. నేషనల్‌ అవార్డ్స్‌ అవార్డ్స్ ఫుల్ లిస్ట్ ఇదే!

గురువారం, భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందనే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని సమర్థించడంతో రాహుల్ గాంధీ ఒక వివాదానికి తెరలేపారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారాం తప్ప అందరికి భారత దేశ ఆర్థిక వ్యవస్థ చనిపోయిందని తెలుసని కాంగ్రెస్ ఎంపీ ఆరోపణలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. బీజేపీ దేశ ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాలను నాశనం చేసిందని, దేశాన్ని నేలమట్టం చేస్తుందని ఆరోపించారు.

అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సొంత పార్టీ ఎంపీలైన శశిథరూర్, రాజీవ్ శుక్లా, కార్తీ చిదంబరం విభేదించారు. మన ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం బలహీనంగా లేదని, ట్రంప్ భ్రమల్లో జీవిస్తున్నారని రాజీవ్ శుక్లా అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదని అందరికి తెలుసని థరూర్ చెప్పారు. ఇక్కడ చనిపోయింది భారత్ ఆర్థిక వ్యవస్థ కాదని, రాహుల్ గాంధీ విశ్వసనీయ అని బీజేపీ నేత అమిత్ మాల్వియా దుయ్యబట్టారు.

Exit mobile version