BJP Slams Rahul Gandhi: ‘భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు!

Rahul Gandhi

Rahul Gandhi

BJP Slams Rahul Gandhi: భారత్ ఆర్థిక పరిస్థితిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారత్ భారీ ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, విద్యా వ్యవస్థలోనూ అనేక లోపాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ రాహుల్ గాంధీ భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు.

కొలంబియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రదీప్ భండారీ తీవ్రంగా మండిపడ్డారు. భారత్ అభివృద్ధి, ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీకి ఉన్న వ్యతిరేకత కారణంగానే ఆయన విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ దేశం గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందుతోందని, భారత ప్రజాస్వామ్యానికి అంతర్జాతీయంగా గౌరవం లభిస్తోందని ప్రదీప్ భండారీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ దేశం ఆర్థిక విపత్తు దిశగా వెళ్తోందని వ్యాఖ్యానించడం సరికాదని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘భారత్ సమ్మిట్’లోనూ విదేశీయులతో భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేయించారని ఆయన ఆరోపించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని ప్రదీప్ భండారీ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రదీప్ భండారీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారీ భారత జాతీయ ప్రయోజనాలకు, దేశ గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత జెండా గౌరవాన్ని, దేశ ప్రయోజనాలను ప్రధాని మోడీ కాపాడుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాత్రం భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేస్తూ దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించారు. దేశంలో రాహుల్ గాంధీ మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే విదేశాలకు వెళ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ‘గుడ్డివారికి పగటిపూట కూడా చీకటే కనిపిస్తుంది’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత జీడీపీ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుస్తోందని, దేశ విదేశీ మారక నిల్వలు కూడా రికార్డు స్థాయిలో ఉన్నాయని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందని, గత 12 సంవత్సరాలుగా ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారం కోసం ఆశపడుతున్నవారే అసంతృప్తితో ఉన్నారని దిలీప్ ఘోష్ విమర్శించారు.

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. భారత్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘నిజం చెప్పాలంటే భారత్ ఒక భారీ ఆర్థిక విపత్తు అంచున ఉంది. ఇదే వాస్తవం. ఈ విషయాన్ని కొందరు పక్కన పెట్టవచ్చు. మీడియా కూడా పట్టించుకోకపోవచ్చు. కానీ దేశంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మన విద్యా వ్యవస్థలోనూ పెద్ద సమస్యలు ఉన్నాయి’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉపాధి, విద్యా వ్యవస్థలో మార్పులు వంటి అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ ఆర్థిక వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలకు మరో వేదికగా మారాయి. ఒకవైపు దేశ ఆర్థిక అభివృద్ధి, జీడీపీ వృద్ధిని బీజేపీ ప్రస్తావిస్తుండగా.. మరోవైపు నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని సమస్యలను రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతిపై అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ చర్చ రానున్న రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది.