రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు. అధ్యక్షుడు సహా వివిధ పదవులు చేపట్టినా పార్టీపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హస్తం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన పాత్ర నామమాత్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్నా కీలకమైన కేంద్ర మంత్రి పదవులు చేపట్టలేదు. ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ ఆయన చెప్పుకోదగ్గ ఫలితాలు రాబట్టలేకపోయారు. దీంతో హస్తం పార్టీ ఒక్కో రాష్ట్రాన్నీ కోల్పోతూ వచ్చింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నిలపలేకపోయాననే ఉద్దేశంతో అధ్యక్ష పదవిని సైతం వదులుకున్నారు. పాలిటిక్స్‌ని సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపిస్తున్నా అది జనానికి పర్ఫెక్ట్‌గా కనిపించట్లేదు. ఇప్పటికీ సొంత ఇమేజ్ అనేది లేకుండా తల్లిచాటు కొడుకు అనే పేరునే మోస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నా రాజకీయంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న దాఖలాల్లేవు. బీజేపీని ముప్పుతిప్పలు పెట్టిన ముచ్చట్లే కరువయ్యాయి. అధికార పక్షాన్ని విమర్శలతో ఇరుకునపెట్టిన సందర్భాలు భూతద్దం పెట్టి వెతికినా దొరకవు.
పార్టీకి, తన కుటుంబానికి పొలిటికల్‌గా ఘన చరిత్ర ఉన్నా దానికి సరైన వారసుడిలా నిరూపించుకోలేకపోయారు. పార్టీకి పూర్వ వైభవం తేవటానికి ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నారనే వార్తలూ లేవు. ఈ నేపథ్యంలో, మరో రెండేళ్లలోపే జనరల్ ఎలక్షన్స్ రానున్నాయి. ముచ్చటగా మూడోసారీ ఓడిపోతే కాంగ్రెస్ దుకాణం బంద్ అనే అవహేళనలూ వ్యక్తమవుతున్న వేళ. యువరాజు మేల్కొన్నాడు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియాకి కొత్త చరిత్ర సృష్టించాలని సంకల్పించాడు. అనుకున్న రోజు కన్నా ముందే నడుం బిగించబోతున్నాడు. తానేంటో, తన సత్తా ఏంటో చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు.
ప్రజలకు చేరువకావాలని కోరుకుంటున్నాడు. కష్టేఫలి అని నమ్మాడు. వందల కిలోమీటర్ల పాదయాత్రకు పూనుకున్నాడు. నేను రాకుమారుణ్ని కాదు మీ కుమారుణ్ని అని వినమ్రంగా చెప్పబోతున్నాడు. ఇకపై మీలోనే ఒకడిగా, మీ తోడూనీడగా ఉంటానంటూ జనం ముందుకు వస్తున్నాడు. బీజేపీ పాలనలో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసేందుకు, ప్రజల కష్టాలను ఆలకించేందుకు బయలుదేరుతున్నాడు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కదన రంగంలోకి దించనున్నాడు. కాంగ్రెస్ కథ కంచికి చేరకుండా చూస్తానని ధైర్యమిస్తున్నాడు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేయనున్నాడు. వచ్చే ఎన్నికల్లో విజయాన్నే లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్ర సెంటిమెంట్ చాలా పార్టీలకు సక్సెస్‌ని తెచ్చి పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్, చంద్రబాబు, జగన్ పాదయాత్రలతో సీఎంలు అయ్యారు. ఇదే ఒరవడి కేంద్రంలో కొనసాగితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటం ఖాయం. అందుకే భారత్ జోడో యాత్ర రాహుల్‌గాంధీని రీలాంచింగ్ చేయనుందనే ప్రచారం జరుగుతోంది.