BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..

  • పెల్లెట్ గన్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్.
  • పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా.
  • రాహుల్ నిరసనను బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు.
Jp Nadda

Jp Nadda

BJP: ఢిల్లీ జంతర్ మంతర్ విద్యార్థి నిరసనల సమయంలో పెల్లెట్ గన్స్ ఘటనపై రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ ఘటనలో గాయపడిన సలేహ్, అతడి తల్లితో కలిసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్, డీసీపీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అయితే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధర్నాపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ‘ఎక్స్’లో ఘాటు విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తోందని, అయినప్పటికీ రాహుల్ గాంధీ కేవలం నాటకం ఆడటానికే పోలీస్ స్టేషన్లు, డీసీపీ కార్యాలయాలకు వెళ్తున్నారనే విషయం దేశ ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ కేవలం నాటకాలు మాత్రమే ఆడగలరని గిరిరాజ్ సింగ్ అన్నారు.

బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అరాచక రాజకీయాలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. అనుమతి లేకుండా ముందస్తు నోటీసులు లేకుండా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద దర్శా చేస్తున్నారని, వందేమాతర గీతంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. యావత్ దేశం రాహుల్ గాంధీ నీచరాజకీయాలు చూస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాహుల్ గాంధీ నిరసన న్యాయం, పిల్లల కోసమో కాదని కేవలం వీడియో ఫుటేజ్ కోసమే అని అన్నారు.