Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ తన 4000 కిలోమీటర్ల ‘‘భారత్ జోడో యాత్ర’’ను ప్రస్తావించారు. రాజకీయాల్లో ఇతరులతో పోటీ పడటం కన్నా, మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకోవడం ముఖ్యమని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇందుకు ఉదాహరణ అని ప్రస్తావిస్తారు. ఇతర రాజకీయ నాయకుల కన్నా మోడీ భిన్నమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలతో రాహుల్ గాంధీ మాట్లాడారు. తన భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ మీరు నాతో పోటీ పడాలంటే 4000 కిలోమీటర్లు నడవాలి. అయితే, మీరు 4000 కిలోమీటర్లు నడిస్తే, నన్ను కాపీ చేసినట్లు ప్రజలు అంటారు’’ అని అన్నారు. రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన నాయకుడికి ఉదాహరణగా ప్రధాని మోడీని ప్రస్తావించారు. రాజకీయ నాయకుడిగా చూస్తే మోడీ కూడా దీనితో నిజంగా పోటీ పడటం లేదని, ఆయన ఇతర రాజకీయ నాయకులందరికన్నా ప్రాథమికంగా భిన్నమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్రేమ, నిజాయితీ కూడా శక్తివంతమైన ఆయుధాలే అని అన్నారు.

