Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ ఓట్ల కోసం ఏదైనా చేస్తారని ఆరోపించారు. ‘‘ మీ ఓట్ల కోసం నరేంద్రమోడీని డ్యాన్స్ చేయమని అడిగితే, అతను వేదికపైనే డ్యాన్స్ చేస్తారు’’ అని ముజఫర్‌పూర్ లో తేజస్వీ యాదవ్‌తో కలిసి పాల్గొన్న ఉమ్మడి ర్యాలీలో రాహుల్ గాంధీ అన్నారు.
భీహారీలకు అతిపెద్ద పండగ అయిన ‘‘ఛత్ పూజా’’ గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలు ఢిల్లీలోని కాలుష్యమైన యమునా నదిలో పూజాలు చేసుకుంటున్నారని, కానీ మోడీ మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన స్మిమ్మింగ్ పూల్ లో స్నానం చేశారని, యమునా నదితో సంబంధం లేదని, మోడీకి ఛత్ పూజాకు సంబంధం లేదని, అతడికి మీ ఓట్లు మాత్రమే కావాలి అని రాహుల్ గాంధీ ఆరోపించారు.
243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్రంలో రెండు కూటములు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ+జేడీయూ+చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ ఉండగా, మహాఘటబంధన్ కూటమిలో ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాలు ఉన్నాయి.
