Shivraj Singh Chouhan: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో భారత్ ఆస్ట్రేలియాపై ఓడిపోవడం రాజకీయ అస్త్రంగా మారింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇటీవల రాజస్థాన్ జలోర్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీపై ‘పనౌటీ’(చెడుశకునం) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఘాటుగానే స్పందించింది. రాహుల్ గాంధీ మానసిక స్థితి సరిగా లేదంటూ బీజేపీ విమర్శించింది. ఇక అస్సాం సీఏం హిమంత బిశ్వ సర్మ ఓ అడుగు ముందుకేసి ఇందిరా గాంధీ జయంతి రోజున మ్యాచు నిర్వహించడంతోనే భారత్ ఓడిపోయిందని, నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల పుట్టిన రోజుల నాడు ఎలాంటి మ్యాచులు నిర్వహించొద్దని బీసీసీఐని కోరారు.
Read Also: Congress: ప్రధాని మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ ఒకే రకం..
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ‘పనౌటీ’ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. రాజస్థాన్ లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీని విమర్శించారు. ‘‘రాహుల్ గాంధీ జాతీయ సమస్యగా మారారు’’ అంటూ ఆరోపించారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, పేపర్ లీక్స్, మహిళలపై నేరాలపై శివరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని అన్నారు.
కాంగ్రెస్ పని ముగిసిందని, రాహుల్ గాంధీ జాతీయ సమస్యగా మారారని, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాధీ ప్రతీరోజూ అబద్ధాలు చెబుతున్నారని, వారికి ఎలా ప్రసంగించాలో తెలియదని ఆయన అన్నారు. ప్రధాని ఫైనల్ మ్యాచ్‌కి వెళ్లి భారత జట్టు గెలవాలని ప్రార్థించారు, ఓడిపోయినప్పుడు ప్రజలు బాధపడ్డారు, కానీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు సంతోషంగా ఉన్నారంటూ ఆరోపించారు.