S Jaishankar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. విదేశాల్లో భారత్ ను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటే అంటూ.. జాతీయ రాజకీయాలను విదేశాల్లో చర్చించడం శ్రేయస్కరం కాదని జైశంకర్ అన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యుల చేశారు. దీనిపై మీడియా జైశంకర్ ని ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు.
Read Also: Bhatti Vikramarka: సీఎం కేసీఆర్‌కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
భారతదేశంలో ఎటువంటి రాజకీయాలు చేసిన తమకు సమస్య లేదని, అంతర్గత విషయాలను విదేశాలకు పట్టుకెళ్లడం మంచిది కాదని ఆయన అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు దేశాన్ని విమర్శించడం, మన రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటే అని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో కథనాలు రూపొందించబడ్డాయని, అవి ఇక్కడ పనిచేయకపోతే, వాటిని విదేశాలకు తీసుకెళ్తారని, బయటి వారి మద్దతు భారతదేశంలో పనిచేస్తుందని వారు ఆశిస్తున్నారని అన్నారు. జాతీయ రాజకీయాలను విదేశాలకు తీసుకెళ్లడం ద్వారా రాహుల్ గాంధీ విశ్వసనీయత పెరగదని అన్నారు.
తూర్పు లడఖ్ సరిహద్దులో చైనా దురాక్రమణపై రాహుల్ గాంధీ విమర్శలపై మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ… పాంగాంగ్ త్సో సరస్సును 1962 సంవత్సరంలో ఆక్రమించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయాన్ని జైశంకర్ పరోక్షంగా ప్రస్తావించారు. మూడు రోజుల క్రితం న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భవిష్యత్తును చూసుకోలేని అసమర్థులని, ప్రధాని నరేంద్ర మోడీ వెనక అద్దంలో చూస్తూ.. భారతదేశం అనే కారును నడపాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు.
