ఒడిశాలోని పూరీ పట్టణం భక్తులతో కిక్కిరిసిరపోయింది. పూరీలో జగన్నాథుడి రథయాత్ర కన్నులపండువగా కొనసాగుతోంది. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా భక్తులు ఈ వేడుకలను తిలకించలేకపోయారు. గతంలో నిబంధనల మధ్య అతి కొద్ది మందితో జరిగింది. ఈసారి అంతా చూసేందుకు అవకాశం కల్పించడంతో గురువారం నుంచే పూరీ నగరం భక్త జనసంద్రాన్ని తలపించింది. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథుడి రథం కదిలింది. నందిఘోష్ రథంలో జగన్నాథుడు, తాళధ్వజలో బలభద్రుడు, దర్పదళన్‌లో సుభద్రను ఊరేగిస్తారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్నాథుడు, దేవీ సుభద్ర, బలభద్రుడు.. రథాలపై కొలువుదీరి భక్తులను ఆశీర్వదిస్తూ పూరీ వీధుల్లో ఊరేగుతున్నారు.
ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్ర నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే 205 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అన్ని ప్రాంతాల నుంచి మరో వెయ్యి బస్సులు నడుపుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పిస్తున్నారు. భారీగా భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. 185 ప్లాటూన్ల బలగాలను సిద్ధంగా ఉంచారు. 1000 మంది పోలీసు ఉన్నతాధికారులు రథయాత్రను సమీక్షిస్తున్నారు. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
ఒడిశా గవర్నర్ గణేషి లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ పూరి జగన్నాథ యాత్రలో పాల్గొన్నారు. సీఎం నవీన్ పట్నాయక్ గవర్నర్, కేంద్ర మంత్రితో కలిసి జగన్నాథుని రథాన్ని లాగారు. ఈ సందర్భంగా జగన్నాథుడిని స్మరిస్తూ జయజయధ్వానాలు మారుమ్రోగాయి.
ఏటా జూన్ లేదా జులైలోని శుక్లపక్షంలోని రెండోరోజు జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. ఈ పనులు కొన్ని నెలల కిందటే ప్రారంభం అవుతాయి. సాధారణంగా ఏ ఆలయంలోనైనా, ఊరేగింపు కోసం ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మూలవిరాట్టును కదిలించరు. కానీ, పూరీలో మాత్రం ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకొచ్చి ఊరేగిస్తారు. అంతేకాదు.. ఇతర అన్ని ఆలయాల్లో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ ఇక్కడ ప్రతిసారి కొత్త రథాలను నిర్మిస్తారు. ఆషాడ శుద్ధ విధియ రోజున ప్రారంభమయ్యే రథయాత్ర 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. ప్రతి ఏటా ఈ ఉత్సవం 12 రోజుల పాటు కొనసాగుతుంది.