Punjab: పంజాబ్ ఎన్నికల ముందు రాజకీయ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ బిట్టును శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పంజాబ్‌లోని లుధియానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం భగవంత్ మాన్ కాన్వాయ్‌పై టొమాటో, గుడ్లు విసరడానికి ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందు గేటు వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేతిలో గుడ్లు, టొమాటోలు ఉన్నాయని, సీఎం మాన్ కాన్వాయ్‌పై విసిరేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు.
లూథియానాలో ఆప్ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం భగవంత్ మాన్, పార్టీ నేత మనీష్ సిసోడియా మొదలైన వారు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెలుపల ఉన్న మార్గం గుండా ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లా్ల్సి ఉంది. ఇదే సమయంలో బిట్టూ టొమాటోలు, గుడ్లతో అక్కడి చేరుకున్నారు. ఈ లోపే పోలీసులు అడ్డుకున్నారు.
ఇదిలా ఉంటే, దీనికి ఒక రోజు ముందు బటాలా సమీపంలో బిట్టూ కాన్వాయ్‌పై గుడ్లు, టొమాటోలు విసిరారు. ఆప్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు బిట్టూ ఆరోపించారు. వరస ఘటనలో పంజాబ్‌లో ఎన్నికల ముందు ఆప్, బీజేపీ మధ్ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ ‘నషా ముక్త్ పంజాబ్ యాత్ర’ ప్రారంభించగా, ఆప్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతోంది.

