Punjab Politics- Governor vs CM: పంజాబ్ రాష్ట్రంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మధ్య వివాదం చెలరేగుతోంది. బలపరీక్ష నిర్వహించి సభలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం భగవంత్ మాన్ అనుకున్నప్పటి నుంచి గవర్నర్, సీఎంల మధ్య వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే తాజాగా భగవంత్ మాన్ కోరిన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చాలా దయ’’తో గవర్నర్ మా అభ్యర్థనను అంగీకరించారని.. స్పీకర్ కల్తార్ సింగ్ సంధ్వన్ ట్వీట్ చేశారు. అయితే ఈ సెషన్ లో బలపరీక్షపై ఓటింగ్ జరుగుతుందా.. లేదా..? అనే దానిపై స్పష్టత లేదు.
అంతకుముందు గవర్నర్ కార్యాలయం అసెంబ్లీ సెషన్ కార్యక్రమాలను జాబితా అడగడంతో.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నర్ పై విమర్శలు గుప్పించింది. అంతకుముందు పంజాబ్ ప్రభుత్వం సెప్టెంబర్ 22న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆలోచనను గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ కొట్టిపారేశారు. ఆపరేషన్ కమల్ జరుగుతోందని.. తమ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ రూ. 25 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ ఆప్ ఆరోపించింది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని వాటిని పోలీసులకు సమర్పించామని ఆప్ పేర్కొంది. దీంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బలపరీక్ష నిరూపించుకోవాలని కోరింది. దీని కోసం గవర్నర్ ను అభ్యర్థించారు.. ఈ నేపథ్యంలో గవర్నర్, సీఎంల మధ్య మాటల యుద్ధం నడిచింది.
Read Also: Woman Marries 6 times: ఏడో పెళ్లికి రెడీ.. అడ్డంగా బుక్కైన నిత్యపెళ్ళికూతురు
అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు సాధారణంగా గవర్నర్ కు శాసన సభ వ్యవహారాల జాబితా అందించబడుతుంది.. అయితే 75 ఏళ్లలో ఏ రాష్ట్రపతి, గవర్నర్ శాసనసభ వ్యవహారాల జాబితాను అడగలేదని సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య ట్వీట్ వార్ నడిచింది. ఎట్టకేలకు గవర్నర్ మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చారు. మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను రద్దు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయంటూ ఆప్ విమర్శించింది. గవర్నర్ చర్యను ‘‘ప్రజాస్వామ్య హత్య’’గా అభివర్ణించింది. క్యాబినెట్ ఆమోదించిన సమావేశాలను గవర్నర్ ఎలా తిరస్కరించగలరని..? ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.