Site icon NTV Telugu

Punjab: కాంగ్రెస్ కు భారీ షాక్.. బీజేపీలోకి నలుగురు మాజీ మంత్రులు

Pti06 04 2022 000143b

Pti06 04 2022 000143b

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ లు తగులుతూనే ఉన్నాయి. వరసగా పార్టీలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వరసగా ఎన్నికల్లో విఫలం అవుతుండటం, అంతర్గత కుమ్ములాటలు పార్టీని బలహీన పరుస్తున్నాయి. దీనికి తగ్గట్లుగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చింతన్ శిబిర్ తర్వాత కూడా పార్టీ నామామాత్రపు చర్యలకే పరిమితం అయింది. పార్టీ తీరుతో విసిగిపోయిన చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ పార్టీలో చేరుతున్నారు.

తాజాగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు మంత్రులతో పాటు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. నలుగురు మాజీ మంత్రులతో సహా ఏడుగురు కాంగ్రెస్ నాయకులు శనివారం చండీగఢ్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరారు. మాజీ మంత్రులు రాజ్‌కుమార్ వెర్కా, బల్బీర్ సింగ్ సిద్ధూ, గుర్‌ప్రీత్ సింగ్ కంగర్, సుందర్ శామ్ అరోరాలతో పాటు కాంగ్రెస్‌ నేతలు కేవల్‌ ఎస్‌ ధిల్లాన్‌, కమల్‌జీత్‌ ఎస్‌ ధిల్లాన్‌, మొహాలీలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ మేయర్‌ అమర్జీత్‌ ఎస్‌.సిద్ధూ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు ఇద్దరు శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) నేతలు బీబీ మొహిందర్ కౌర్ జోష్, సరూప్ చంద్ సింగ్లా కూడా ఈరోజు కమలం గూటికి చేరారు.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ లో కీలక నేత హర్ధిక్ పటేల్ ఇటీవల బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే పంజాబ్ కాంగ్రెస్ ప్రముఖ నేతలు సునీల్ జాఖర్, ప్రమోద్ మధ్వరాజ్, అశ్విన్ కొత్వాల్ వంటి నేతలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇక త్వరలో ఎన్నికలు జరగబోతున్న ఉత్తరాఖండ్ లో కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నారు.

Exit mobile version