NTV Telugu Site icon

Puja Khedkar: హైకోర్టులో పూజా ఖేద్కర్ మరో పిటిషన్.. ఏం అభ్యర్థించిందంటే..!

Pujakhedkar

Pujakhedkar

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాశానని.. అయితే వాటిలో కేవలం ఐదింటిని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆమె కోరారు. ఐఏఎస్ ఉద్యోగాన్ని సంపాదించడానికి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ ఆమెపై చర్యలు తీసుకుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. దీంతో ఆమె ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అనర్హత వేటుపై ఆమె కోర్టులో వాదనలు వినిపించింది. ఏసీఎల్ గాయం కారణంగా ఎడమ మోకాలు అస్థిరంగా ఉన్నట్లు మహారాష్ట్ర హాస్పటల్ ఇచ్చిన ధృవీకరణ ఉందని ఆమె కోర్టుకు వెల్లడించింది. తాను దివ్యాంగురాలి కేటగిరిలో రాసిన పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. తనకు 47శాతం వైకల్యం ఉందని.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 శాతం దాటితే దివ్యాంగులుగా గుర్తిస్తారని ఆమె వెల్లడించింది.

జనరల్‌ కేటగిరి అభ్యర్థినిగా రాసిన ఏడు పరీక్షలను పరిగణనలోకి తీసుకోకూడదని తాజాగా న్యాయస్థానంలో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ఆమె పేర్కొన్నారు. ఒకవేళ న్యాయస్థానం దీనిని అంగీకరిస్తే ఆమె.. కేవలం ఐదుసార్లు మాత్రమే పరీక్షలకు హాజరైనట్లు అవుతుంది. ఫోర్జరీ, చీటింగ్‌ కేసుల్లో తనను అరెస్టు చేయకుండా పూజా ఖేద్కర్‌ కొన్నాళ్ల క్రితం ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసులు ఈ అంశంపై స్పందన తెలియజేయాలని.. అప్పటివరకు ఆమెను అరెస్టు చేయవద్దని న్యాయస్థానం పేర్కొంది.

ఇక పేరులో మార్పులు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 12 సార్లు సివిల్స్‌ పరీక్షలకు హాజరైనట్లు వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. పేరు మధ్యలో మాత్రమే చిన్న మార్పు చేశానని.. మొత్తం మార్చలేదని ఆమె వాదిస్తున్నారు. యూపీఎస్సీ బయోమెట్రిక్‌ వ్యవస్థ డేటా కూడా తన గుర్తింపును పరీక్షించిందని పేర్కొంది.