Puducherry Political Crisis: పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సంకీర్ణంలో ఎన్ఆర్ కాంగ్రెస్, తమను పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రంగస్వామి వైఖరిని తప్పుపడుతున్నారు బీజేపీ నేతలు.
బార్ లైసెన్సులు వ్యవహారంలో, ప్రభుత్వం పదవుల విషయంలో ఇరు పార్టీల మధ్య ఇరు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా ఇరు పార్టీల నేతలు విమర్శించుకుంటున్నారు. బార్ లైసెన్సుల విషయంలో సీఎం రంగస్వామి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు బీజేపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. దీంతో హోంమంత్రి నమశివాయ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేల మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి పోటీగా ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీపై ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టేందుకు బీజేపీ ఆపరేషన్ చేస్తోందని ఎన్ఆర్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
పుదుచ్చేరిలో ఇండిపెండెంట్ సభ్యలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. పుదుచ్చేరిలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 33. ఇందులో ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాలు గెలవగా.. బీజేపీ 6, ఇండిపెండెంట్లు 6 స్థానాల్లో గెలుపొందారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు చెరో రెండు స్థానాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో సీఎం రంగస్వామితో పాటు మరో ముగ్గురు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన వారు ఉన్నారు. బీజేపీ నుంచి శరవణ కుమార్, నమశ్శివాయ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. స్పీకర్ గా బీజేపీ నుంచి ఆర్ సెల్వన్ ఉండగా..డిప్యూటీ స్పీకర్ గా ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి రాజు వేలు ఉన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ లోని అసంతృప్తుల్ని కూడా తమవైపు తిప్పుకునేలా బీజేపీ పావులు కదుపుతోంది.