Site icon NTV Telugu

Money Laundering Case: సీఎం కూతురుపై ఈడీ మనీలాండరింగ్ కేసు..

Veena Vijayan

Veena Vijayan

Money Laundering Case: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతరు చిక్కుల్లో పడ్డారు. సీఎం కుమార్తె వీణా విజయన్‌తో పాటు ఆమె ఐటీ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసినట్లు ఏజెన్సీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఓ మినరల్ కంపెనీ, వీణా విజయన్ సంస్థకు అక్రమ చెల్లింపులు చేసినట్లు ఆరోపణలు రావడంతో, ఈడీ కేసును నమోదు చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఫిర్యాదు మేరకు ఈడీ కేసు నమోదు చేసిందని, ఈ విషయంపై కేంద్రం దర్యాప్తు చేయాల్సిందిగా కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: Kangana ranaut: కంగనా రనౌత్‌పై వ్యాఖ్యల ఫలితం.. సుప్రియా శ్రీనతేకి ఈసీ నోటీసులు..

కొచ్చికి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) అనే ప్రైవేట్ కంపెనీ 2017 మరియు 2018 మధ్య ఎటువంటి సేవలు అందించనప్పటికీ, వీణా విజయన్ యాజమాన్యంలో ఉన్న ఎక్జాలాజిక్ సొల్యూషన్స్‌కి రూ 1.72 కోట్ల చెల్లింపు చేసిందనేది ప్రధాన ఆరోపణ. వీణా విజయన్‌కి ఓ ‘‘ప్రముఖ వ్యక్తి’’తో ఉన్న సంబంధాల కారణంగా సదరు ఖనిజ సంస్థ, వీణా కంపెనీకి నెలవారీ చెల్లింపులు చేసినట్లు పేర్కొంది.

అయితే, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. గత నెలలో కోర్టు ఈ పిటిషన్‌ని కొట్టేసింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ చేతులకు సంకెళ్లు వేయలేమని కోర్టు పేర్కొంది. జనవరిలో కేరళ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. తన కుమార్తె తన భార్య పదవీవిరమణ డబ్బులతో కంపెనీని ప్రారంభించిందని, తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు.

Exit mobile version