NTV Telugu Site icon

Khakistan Protests: కెనడాలో ఖలిస్తానీల ఆందోళనలు.. ధీటుగా స్పందించిన భారతీయులు

Pro India Group Vs Khalistani Protesters

Pro India Group Vs Khalistani Protesters

Khakistan Protests: కెనడాలో భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్తానీ మద్దతుదారులు భారత దౌత్యకార్యాలయాల ముందు భారీగా ఆందోళనలు చేపట్టారు. టొరంటోలోని దౌత్యకార్యాలయం ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. జూలై 8న భారీ ఎత్తున ఆందోళనకు ఖలిస్తానీవాదులు పిలుపునిచ్చారు. పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో నిన్న వందలాది మంది భారత కాన్సులేట్ ముందు ఖలిస్తాన్ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఇదిలా ఉంటే అక్కడ ఉండే భారతీయులు కూడా అదే స్థాయిలో స్పందించారు. భారతదేశానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా జెండాలను పట్టుకుని ప్రదర్శనకు దిగారు. తొలుత ఖలిస్తానీలు ఆందోళనలు చేపట్టగా.. ఆ తరువాత భారత్ మద్దతు ప్రదర్శనలు జరిగాయి.

Read Also: Right Age For Pregnancy: తల్లి కావడానికి సరైన వయసు ఇదే.. దాటితే సమస్యలు తప్పవు

కెనడా, యూఎస్ఏ, యూకేల్లో భారత వ్యతిరేక ఆందోళనలకు ఖలిస్తానీలు పిలుపునిచ్చారు. దీంతో ఆయా దేశాల్లో భారత దౌత్యకార్యాలయాల ముందు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని భారత కార్యాలయానికి భద్రత పెంచారు. భారత దౌత్యవేత్త తరణ్‌జీత్ సింగ్ ఎంబీసీ వద్ద పరిస్థితి సమీక్షించారు. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కో దౌత్యకార్యాలయానికి ఖలిస్తానీలు నిప్పటించారు. ఈ ఘటనను అమెరికా ఖండించింది.

ఇటీవల అనుమానాస్పదంగా ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు మరణించారు. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అంతకుముందు పాకిస్తాన్ లోని లాహోర్. యూకేల్లో ఇలాగే ఇద్దరు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే వీటికి భారతే కారణం అంటూ ఖలిస్తానీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత దౌత్యవేత్తలను బెదిరించే విధంగా కెనడా వ్యాప్తంగా పోస్టర్లు వేశారు. కిల్లర్ ఇండియా అంటూ విద్వేషపూరిత రాతలతో భారత వ్యతిరేకతను ప్రదర్శించారు. వీటిపై కెనడా దేశానికి ఇప్పటికే భారత్ తన నిరసన తెలిపింది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని భారత్ తీవ్రంగానే స్పందించింది.